Begin typing your search above and press return to search.

'రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్' వైపు మారాం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

దేశభద్రత, సైనిక వ్యూహాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   30 May 2026 4:00 PM IST
రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్  వైపు మారాం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దేశభద్రత, సైనిక వ్యూహాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రువుల చర్యలకు కేవలం స్పందించే (రియాక్టివ్) స్థాయి నుంచి, ముందే ఊహించి తిప్పికొట్టే (ప్రొయాక్టివ్) స్థాయికి మన సైన్యం ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు. పూణేలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 150వ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ఆయన, యువ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావిస్తూ మన సైన్యం బలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశారు.

ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ

భారత్‌ను ఎవరైనా కవ్విస్తే దేశం ఏ రేంజ్‌లో స్పందిస్తుందో చెప్పడానికి ‘ఆపరేషన్ సింధూర్’ ఒక నిలువెత్తు నిదర్శనమని జనరల్ ఉపేంద్ర ద్వివేది గుర్తు చేశారు. "దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మన సైన్యం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని చెప్పడానికి ఈ ఆపరేషనే ఒక బెంచ్‌మార్క్. ఇది శత్రుదేశాలకు ఒక బలమైన హెచ్చరిక. మన రక్షణ వ్యవస్థ ఇప్పుడు మరింత దూకుడుగా, వ్యూహాత్మకంగా మారింది’’ అని ఆయన వివరించారు.

యువ సైనికులకు కీలక సూచనలు

టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆధునిక యుద్ధ తంత్రాలు కూడా మారుతున్నాయని ఆర్మీ చీఫ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్‌డీఏ నుంచి ఉత్తీర్ణులైన కేడెట్లను అభినందిస్తూ, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరంతరం సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేవలం సాంప్రదాయ యుద్ధాలకే పరిమితం కాకుండా సైబర్, స్పేస్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక రక్షణ రంగాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు.

దేశ రక్షణ బాధ్యతలను భుజాన వేసుకోబోతున్న యువ అధికారులు ఎల్లప్పుడూ శత్రువు కంటే ఒక అడుగు ముందే ఉండాలని హితవుపలికారు. సరిహద్దుల్లో శాంతిని కాపాడటంతో పాటు, దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘ఆపరేషన్ సింధూర్’ అందించిన స్ఫూర్తితో భారత సైన్యం సరికొత్త రక్షణ వ్యూహాలతో ముందడుగు వేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. శత్రువుల వ్యూహాలను ముందే అడ్డుకునేలా భారత్ తీసుకుంటున్న ‘ప్రొయాక్టివ్’ నిర్ణయాలు దేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.