87 + 32 = 119... కలిసే పోటీ చేస్తున్నారా?
అవును... ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది... మిగిలిన ఏ పార్టీ అయినా అటు బీఆరెస్స్ కి కానీ, విపక్షాలకు కానీ పరోక్షంగా మేలు చేసేవే అనే మాటలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 17 Oct 2023 10:19 AM ISTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్న సంగైతి తెలిసిందే. ఇక్కడ మూడు ప్రధాన పార్టీలలోనూ బీఆరెస్స్, కాంగ్రెస్ లు మొత్తం 119 స్థానాల్లోనూ పోటీచేస్తుండగా... బీజేపీ వైఖరి ఇంకా తెలియాల్సి ఉంది! ఆ మూడు ప్రధాన పార్టీల సంగతి అలా ఉంటే... రాబొయే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీచేసేది చెప్పే విషయంలో జనసేన ఇప్పటికే ప్రకటించగా.. టీడీపీ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరచర్చ తెరపైకి వచ్చింది.
అవును... ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది... మిగిలిన ఏ పార్టీ అయినా అటు బీఆరెస్స్ కి కానీ, విపక్షాలకు కానీ పరోక్షంగా మేలు చేసేవే అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ విమర్శ జనసేనపై ఉందని అంటున్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీచేస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతూ.. పరోక్షంగా బీఆరెస్స్ కు సపోర్ట్ చేయడమే పవన్ "లెక్క" అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన 32 స్థానాల్లోనే పోటీ చేస్తుందని తెలిపారు. ఒకవేళ ఏవైనా పొత్తులు ఏర్పడితే నియోజకవర్గాలు, పోటీ చేసే స్థానాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలంగాణ జనసేన నేతలు అన్నారు. అయితే ఇప్పటివరకూ పోటీచేసే స్థానాలు ప్రకటించారే తప్ప.. అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు! ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ కూడా తెలంగాణలో పోటీపై ఒక స్పష్టత ఇచ్చింది. ఇందులో భాగంగా... 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది!
ఇక్కడ కూడా సెం టు సేం అన్నట్లుగా... టి.టీడీపీ కూడా స్థానాల నెంబర్ చెప్పిందే కానీ... ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. ఆ సంగతి అలా ఉంటే... ఈ ప్రకటన చేసే సమయంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "టీడీపీ ఎన్నికల్లో నిలబడితే కొన్ని పార్టీలకు పుట్టగతులు ఉండవు" అనేది ఆ ఆసక్తికర వ్యాఖ్యల్లో మచ్చుకు ఒకటి!
తాజాగా ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు నిలబడేవి కావని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని జోస్యం చెప్పారు. ఇక తాను 14న ములాఖాత్ లో చంద్రబాబుని కలిశానని.. ఆయన బరువు తగ్గారని.. ఎక్కువ సమయం ఆయన ఆరోగ్యం గురించే మాట్లాడామని చెప్పుకొచ్చారు. ఈ నెల 18న మరోసారి కలుద్దామని ఆయన బాబు భరోసా ఇచ్చారని తెలిపారు!
ఆ సంగతి అలా ఉంటే... ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే 30 మంది జాబితాతో చంద్రబాబుతో చర్చించామని చెప్పుకొచ్చిన కాసాని... 87మంది జాబితా సిద్ధంగా ఉందని, వీటిపై సర్వే చేస్తున్నామని తెలిపారు. అనంతరం జనసేనతో పొత్తు విషయమై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పడం గమనార్హం. దీంతో... టీడీపీ - జనసేనల భావసారూప్యత ఏపీలో ఒకలా, తెలంగాణలో ఒకలా ఉంటుందా అనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఆ సంగతి అలా ఉంటే... టి.టీడీపీ చెబుతున్న 87, జనసేన ఇప్పటికే స్థానాల పేర్లు ప్రకటించిన 32 కలిస్తే మొత్తం 119 అవుతుందని.. అందువల్ల ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నానే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. అయితే... ఇప్పటికీ పొత్తు విషయం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని కాసాని చెబుతుంటే... పొత్తు ఉంటే సీట్లలో మార్పులు చేర్పులూ ఉంటాయని టి.జనసేన నేతలు చెప్పుకుంటున్నారు.
దీంతో... టోటల్ 119 వస్తుండటంతో కలిసే పోటీచేస్తారని రెండు పార్టీల అభిమాన్లు, కార్యకర్తలు ఆశగా ఉన్నారని అంటున్నారు. నిజంగా ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే... అసెంబ్లీ స్థానాల విషయంలో ఇరుపార్టీలకు తకరారు తప్పదనే అనుకోవాలి. కారణం... టీడీపీ బలంగా ఉండేదని, ఇప్పటికీ అక్కడ కేడర్ ఉందని చెప్పుకునే కీలక నియోజకవర్గాలలోనే పోటీచేస్తున్నట్లు జనసేన ప్రకటించడం.
ఉదాహరణకు... కూకట్ పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సనత్ నగర్, పటాన్ చెరు, ఉప్పల్, వైరా, ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు, ఇల్లందు మొదలైన స్థానాల్లో టీడీపీకి కేడర్ ఉందని చెబుతుంటారు. అయితే జనసేన ప్రకటించిన స్థానాల్లో ఇవి కీలకంగా ఉన్నాయి. దీంతో... ఇలాంటి కొన్ని స్థానాల విషయంలో పవన్ కల్యాణ్ రాజీపడిపోతే కలిసి పోటీచేసినా కూడా ఇరుపక్షాలకూ ఇబ్బంది ఉండదనేది పలువురి అభిప్రాయంగా ఉంది.
ఏది ఏమైనా... 87 + 32 = 119 అనే ప్లాన్ టీడీపీ, జనసేనల మధ్య ఎప్పటినుంచో ఉందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. వీరి పోటీ తెలంగాణలో ఏ ప్రధాన పార్టీకి కలిసి వస్తుంది, ఏ పార్టీకి నష్టం వాటిళ్లుతుందనేది వేచి చూడాలి. కారణం... తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారే తప్ప, బీఆరెస్స్ పై పెద్దగా స్పందించడం లేదనే కామెంట్లు వినిపించడమే! దీంతోనే... వారి వ్యూహాలపై ఒక స్పష్టతకు రావడం బెటరని అంటున్నారు పరిశీలకులు.
