Begin typing your search above and press return to search.

వైసీపీ క్రెడిట్ క్లెయిం...రెండేళ్ళు ఏం చేశారో ?

ఏపీలో ప్రస్తుతం పెట్టుబడులు వస్తున్నాయి. లేటెస్ట్ గా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్దా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి భూమి పూజ జరిగింది.

By:  Satya P   |   25 March 2026 8:15 AM IST
వైసీపీ క్రెడిట్ క్లెయిం...రెండేళ్ళు ఏం చేశారో ?
X

ఏపీలో ప్రస్తుతం పెట్టుబడులు వస్తున్నాయి. లేటెస్ట్ గా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్దా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కుమార స్వామి ఇతర పెద్దలంతా తరలి వచ్చి ఈ ప్లాంట్ కి శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్లాంట్ ని తామే ఏపీకి తీసుకుని వచ్చామని వైసీపీ అంటోంది. అనాటి వైసీపీ ప్రభుత్వ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇదంతా తమ కృషి అని అంటున్నారు. అయితే దానికి వైసీపీ చెప్పే విషయాలు మీదనే అంతా చర్చిస్తున్నారు.

కలిసింది నిజమే :

ఇక 2022లో జగన్ దావోస్ టూర్ వెళ్ళారు. ఆనాడు ఆయన అక్కడ ఆదిత్య మిట్టల్ ని కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టమని కోరారు. ఇవన్నీ వాస్తవమే అయినా 2022 నుంచి 2024 జూన్ దాకా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే ఉంది. అంటే దాదాపుగా రెండున్నరేళ్ళు అన్న మాట. మరి ఆనాడే అభ్యర్ధించిన వైసీపీ ప్రభుత్వం మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్ ని తమ హయాంలోనే ఎందుకు తీసుకుని రాలేకపోయింది అని ప్రశ్నలు వస్తున్నాయి. రెండున్నరేళ్ళు అంటే తక్కువ కాలమేమీ కాదు కదా అని అంటున్నారు

పెట్టుబడులు వచ్చాయంటే :

భారీ పరిశ్రమలు ఏపీకి రావాలని తేవాలని వైసీపీ పెద్దలకు ఉంటే తమ అయిదేళ్ల పదవీ కాలంలో ఎన్ని సార్లు దావోస్ టూర్ కి వెళ్ళారని కూటమి నేతల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం ఒకే ఒక్కసారి దావోస్ కి వెళ్ళి పెట్టుబడులు ఏమీ తేకుండానే వచ్చేశారు అని అంటున్నారు. ఒక మొక్కుబడిగా కలసి కోరితే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టరన్నది కూడా కూటమి నేతలు చెబుతున్నారు. వారితో నిరంతరం చర్చలు జరపాలి. పక్కాగా ప్రణాళికలు ఉండాలి, ప్రోత్సాహకాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటివి పాలనా పరంగా ఉండాలి, అపుడే వారు తరలి వస్తారు అని అంటున్నారు. వైసీపీ హయాంలో ఇవన్నీ లోపించబట్టే పరిశ్రమలు రాలేదని కూటమి నుంచి వస్తున్న ఘాటు విమర్శగా ఉంది.

క్రెడిట్ కోసమేనా :

వైసీపీ అయితే ఎపుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోంది అన్న విమర్శలు చేస్తున్నారు. గతంలో అయితే అనంతపురంలో కియా మోటార్స్ వైఎస్సార్ రాసిన లేఖ వల్లనే వచ్చిందని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా తమదే క్రెడిట్ అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి నుంచి తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో తాజాగా చూస్తే ఆదిత్య మిట్టల్ తో జగన్ దిగిన ఫోటోని పెట్టి తమదే మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ అని వైసీపీ నేతలు చెప్పుకోవడం మీద కూటమి నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది అంటున్నారు.

లోకేష్ కృషి చంద్రబాబు విజన్ :

ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి వల్లనే మిట్టల్ లాంటి స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయని అంటున్నారు. ఈ ప్లాంట్ వల్ల లక్ష దాకా ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. అంతే కాదు ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు వస్తున్నాయంటే మంత్రి నారా లోకేష్ కృషి చంద్రబాబు విజన్ దీని వెనక ఉన్నాయని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం ప్రతీ దానిని క్రెడిట్ చోరీ అంటూ తమ హయాంలో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే క్రెడిట్ చోరీ అని వైసీపీ ఆరోపిస్తూంటే క్రెడిట్ క్లెయిం కి వైసీపీ పాట్లు అని కూటమి ధీటుగా బదులిస్తోంది.