మార్చి 23.. ఏపీ చరిత్రలో గొప్ప రోజు.. ఏంటీ స్పెషల్!
ఏపీ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కొలిక్కివస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 22 March 2026 1:00 AM ISTఏపీ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కొలిక్కివస్తున్నాయని అంటున్నారు. 21 నెలల పాలనలో దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఆ పెట్టుబడులను గ్రౌండింగ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోందని చెబుతోంది. దీనికి ఉదాహరణగా మార్చి 23న అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంటుకు జరగబోయే శంకుస్థాపనను చూపుతోంది. ఆ రోజును ఏపీ చరిత్రలోనే గొప్ప రోజుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
మార్చి 23న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రాత్మక అడుగు పడుతోందని ప్రభుత్వం ప్రకటించింది. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించింది. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పనులకు భూమిపూజ చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు. 5,465 ఎకరాల్లో మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది.
క్యాప్టివ్ పోర్టుతో మరో 6 వేల ఉద్యోగాలు
స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును కూడా ఏఎంఎన్ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రత్యేకంగా రూ.11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మరో 6,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిశ్రమల హబ్‌గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దేశంలో భారీగా పెరిగిన ఉక్కు మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఏఎంఎన్ఎస్ ఇండియాకు లభించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం
ఈ ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా 4 లేన్ రహదారి విస్తరణ పనులు చేపట్టింది. కనెక్టివిటీ పెంచడంతో పాటు పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు శరవేగంగా కల్పిస్తోంది. ఇక సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
