చంద్రబాబు స్కిల్ కేసులో అప్రూవర్‌గా మారనున్న చంద్రకాంత్.. ఎవరు? ఏంటి?
ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన దాదాపు అందరికీ కూడా హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వగా.. చంద్రబాబు ఒక్కరిపైనే బెయిల్ విచారణ సాగుతోంది.
By: Tupaki Desk | 16 Nov 2023 5:32 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసు రాష్ట్రంలోనే కాకుం డా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాబు అరెస్టయి.. జైల్లో కూడా ఉన్నారు. అనంతరం మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన దాదాపు అందరికీ కూడా హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వగా.. చంద్రబాబు ఒక్కరిపైనే బెయిల్ విచారణ సాగుతోంది.
ఇదిలావుంటే.. ఇదే స్కిల్ కేసులో `ఏ13`గా ఉన్న చంద్రకాంత్ ను కూడా గతంలో సీఐడీ అరెస్టు చేసింది. కొన్నాళ్లు ఈ కేసు హైకోర్టులో విచారణ జరగ్గా.. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఇక, ఇప్పుడు ఆయన అప్రూవర్‌గా మారి నిజాలు చెబుతానంటూ.. ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవర్‌గా మారతానంటూ.. పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.. వచ్చే నెల 5న నేరుగా కోర్టుకు వచ్చి హాజరు కావాలని చంద్రకాంత్‌ను ఆదేశించింది. దీనికి పిటిషనర్ తరఫున న్యాయవాది అంగీకరించారు. ఇదిలావుంటే, స్కిల్ కేసులో సీఐడీ మొత్తం 37 మందిని అరెస్టు చేసింది. వారిలో చంద్రబాబు మినహా అందరూ బెయిల్‌పై ఉండడం గమనార్హం.