భారతీయుడికి యాపిల్ ఏఐ పగ్గాలు... ఎవరీ సుబ్రమణ్య..!
ప్రస్తుతం టెక్ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచిస్తున్నాయి!
By: Tupaki Desk | 2 Dec 2025 2:00 PM ISTప్రస్తుతం టెక్ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచిస్తున్నాయి! ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య ఈ రంగంలో పోటీ రోజు రోజుకీ ముదురుతుంది. ఇందులో ముందుకు వెళ్లలేకపోతే అది కంపెనీని వెనక్కి నెట్టేస్తుందని బలంగా నమ్ముతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో పలు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఈక్రమంలో.. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగ భాధ్యతలను భారతీయుడికి అప్పగించింది. ఈ క్రమంలో.. యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ గా అమర్ సుబ్రమణ్యను నియమించింది. ఇప్పటివరకూ యాపిల్ ఏఐ చీఫ్ గా జాన్ జియానాండ్రియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అవును... ఏఐ రంగంలో పోటీ రోజు రోజుకీ ముదురుతున్న వేళ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నాయకత్వ మార్పు చేపట్టింది. ఇందులో భాగంగా.. ఇప్పటివరకూ ఆ సంస్థ ఏఐ చీఫ్ గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో.. ఓ భారతీయుడికి ఆ బాధ్యతలను అప్పగించింది. ఇకపై జాన్ స్థానంలో అమర్ సుబ్రమణ్య ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే... ఆ పదవిలో జాన్ జియానాండ్రియా వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగనున్నారు.. ఆ నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అప్పటివరకూ సుబ్రమణ్య అడ్వైజర్ హోదాలో కొనసాగుతారు. కాగా... "సిరి"లో కీలక ఏఐ అప్ డేట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ నాయకత్వ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరీ అమర్ సుబ్రమణ్య..!:
భారత్ కు చెందిన అమర్ సుబ్రమణ్య 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి తన బ్యాచిలర్ ఇన్ ఇంజినీరింగ్ (బీఈ) పూర్తి చేశారు. ఆ తర్వాత 10 నెలల పాటు ఐబీఎంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేశారు. తర్వాత.. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి తన పీ.హెచ్.డీ పూర్తి చేశారు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం... 2005లో ఇంటర్న్ గా పని చేశారు.
ఇదే క్రమంలో 2009లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా గూగుల్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. గూగుల్ లో ఉన్న సమయంలోనే జెమినీ ఏఐ అసిస్టెంట్ అభివృద్ధికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది జూన్ లో ఆయన గూగుల్ ని వదిలి మైక్రోసాఫ్ట్ లో చేరారు. అక్కడ సుమారు 5 నెలల పాటు ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసిన తర్వాత యాపిల్ లో చేరారు.
