Begin typing your search above and press return to search.

బాబు నుంచి ఏపీ ఏమి ఆశిస్తోంది ?

ఏపీ ప్రజలు ల్యాండ్ స్లైడ్ విక్టరీని టీడీపీ కూటమికి అందించారు. టీడీపీ ఆవిర్భవించాక ఇంతటి విజయాన్ని దక్కించుకోలేదు

By:  Tupaki Desk   |   11 Jun 2024 10:24 AM GMT
బాబు నుంచి ఏపీ ఏమి ఆశిస్తోంది ?
X

ఏపీ ప్రజలు ల్యాండ్ స్లైడ్ విక్టరీని టీడీపీ కూటమికి అందించారు. టీడీపీ ఆవిర్భవించాక ఇంతటి విజయాన్ని దక్కించుకోలేదు. దీని మీదనే ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నిక అయ్యాక చంద్రబాబు మాట్లాడుతూ అన్నారు. ఇది 93 శాతం స్ట్రైకింగ్ రేట్ అని ఆయన అభివర్ణించారు.

ఏపీ ప్రజలు పవిత్రమైన బాధ్యతను కూటమి మీద ఉంచారు అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అమరావతినే రాజధానిగా ఆయన ఎన్డీయే సమావేశంలో ప్రకటించారు. ఇది ఆయన కరెక్ట్ గానే ప్రజల నాడిని అంచనా వేసి చెప్పారనుకోవాలి. ఏపీలో అభివృద్ధి లేదు అన్నది జనంలో ఉన్న భావన. కనీసం చెప్పుకునేందుకు రాజధాని కూడా లేదు అని కూడా అయిదు కోట్ల జనం తీవ్ర ఆవేదన చెందారు.

అలా వారి ఆవేదన అసంతృప్తి ఒక కచ్చితమైన తీర్పు రూపంలో బయటకు వచ్చింది. చాలా సేపు ఎన్డీయే సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఎక్కువగా అభివృద్ధి గురించే ప్రస్తావించడం గమనార్హం. ఆయన విశాఖను ఆర్ధిక రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కర్నూల్ ని ఏ మాత్రం తక్కువ కాకుండా అభివృద్ధి చేస్తామని కూడా పేర్కొన్నారు.

ఈ విధంగా మూడు ప్రాంతాలలో సమగ్రాభివృద్ధి టీడీపీ కూటమి లక్ష్యమని కూడా ఆయన స్పష్టంగానే చెప్పారు. అదే సమయంలో సంక్షేమం గురించి బాబు పెద్దగా మాట్లాడలేదని చర్చ సాగుతోంది. కూటమి సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలను ఇచ్చింది. వైసీపీ కంటే రెట్టింపు పధకాలు అని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేశారు.

అయితే దాని మీద మాత్రం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా బాబు ఎక్కువగా మాట్లాడలేదు అని అంటున్నారు. పైగా బాబు చాలా ఆసక్తికరమైన అంశాలనే చెప్పారు. ఏపీలో ఎంత అప్పు ఉంది అన్నది తెలియదు అన్నారు. దిగేదాకా లోతు తెలియదని అందువల్ల మొత్తం స్టడీ చేయాలన్నది బాబు మాటల వెనక ఉన్న అర్ధంగా భావించాలి.

ఏపీలో అప్పుల కుప్పగా అంతా ఉందని బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో అన్ని వ్యవస్థలు శిధిలం అయ్యాయని మొత్తం మీద చూస్తే మొదటి నుంచి పని ప్రారంభించుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ భారీ కృషిలో తనకు అంతా సహకరించాలని ఆయన కోరారు. ఒక విధంగా చెప్పలంటే బాబు ముందు అభివృద్ధి సంక్షేమం రెండూ ఉన్నాయి.

మరీ ముఖ్యంగా బాబుని ప్రజలు ఎన్నుకుంది అభివృద్ధి కోసం అని కూడా అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం, అమరావతి రాజధాని పరిపూర్తి చేయడం వంటివి రానున్న అయిదేళ్లలో బాబు చేస్తే ఆయనకు తిరుగు ఉండదని కూడా అంటున్నారు. ఇక సంక్షేమ పధకాల విషయంలో చూస్తే ఎన్నో అమలు చేసిన జగన్ ని అయిదేళ్ళ తరువాత జనాలు ఓడగొట్టారు అంటే వాటి గురించి కూడా నిశిత పరిశీలన చేయాల్సి ఉంది అని అంటున్నారు.

ఆపన్నులకు అణగారిన వర్గాలకు సంక్షేమం తప్పనిసరి అదే టైం లో దూబారా చేసి పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేయాలనుకోవడం మంచింది కాదు అన్న సూచనలు వస్తున్నాయి. జగన్ సంక్షేమ పధకాలు చాలా వరకూ అనర్హులకు కూడా వెళ్లాయని చెబుతున్నారు.

ఎవరినీ కాదనకుండా అందరికీ పధకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని అంటున్నారు. చంద్రబాబు అలా కాకుండా అర్హులను కచ్చితంగా ఎంపిక చేసి అవసరం ఉన్న వారికే పధకాలు ఇవ్వడం మంచిది అని అంటున్నారు. అంతే తప్ప అప్పులు తెచ్చి పధకాలు ఇవ్వాల్సింది లేదు అన్న వాదన కూడా ఉంది. మొత్తం మీద చూస్తే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం విషయంలో కొత్త ప్రభుత్వం బ్యాలెన్స్ తో వెళ్తేనే ఏపీ ప్రగతి బాటన సాగుతుంది అని అంటున్నారు.