Begin typing your search above and press return to search.

ఏపీలో హింసాత్మక సంఘటనలు...బాధ్యులు ఎవరు ?

ఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ పోలింగ్ సాగింది. అది శుభ సూచకం. ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చే చర్యగా దానిని అంతా చూస్తున్నారు

By:  Tupaki Desk   |   15 May 2024 11:30 PM GMT
ఏపీలో హింసాత్మక సంఘటనలు...బాధ్యులు ఎవరు ?
X

ఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ పోలింగ్ సాగింది. అది శుభ సూచకం. ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చే చర్యగా దానిని అంతా చూస్తున్నారు. దాంతో ఓటర్లలో చైతన్యం తీసుకుని వచ్చి పోలింగ్ బూత్ ల దాకా నడిపించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమ వంతుగా ప్రయత్నం చేశాయి. అది ఫలవంతం అయింది.

ఇదిలా ఉంటే ఏపీలో పోలింగ్ ఒక పక్కన జరుగుతూంటే పల్నాడు జిల్లాలో మంటలు చెలరేగాయి. మాచర్ల లో మారణ కాండ సాగింది. సత్తెనపల్లి గురజాల ఇలా చాలా చోట్ల చోటు చేసుకున్న సంఘటనలు అన్నీ చూసిన వారికి ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి తిరుపతిలలో కూడా ఉద్రిక్తతలు చెలరేగాయి.

మరో వైపు చూస్తే కడప జిల్లాలోని జమ్మలమడుగులో అగ్గి రాజుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలు భీకరమైన స్థాయిలో జరిగాయి. ఇవన్నీ చూసునపుడు ఏపీలో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే రాక మానదు, పోలింగ్ రోజుకే ఇది పరిమితం కాలేదు. 13న పోలింగ్ జరిగితే 15వ తేదీ వచ్చినా దాడులు ఉద్రిక్తతలు అలాగే సాగుతున్నాయి.

సాధారణంగా పోలింగ్ రోజున గొడవలు జరుగుతాయి. ఆ తరువాత కౌంటింగ్ రోజున ఫలితాలు చూసుకుని తమకు ఓటేయని గ్రామాల మీద కోపం పెంచుకోవడం గతంలో జరిగేది. ఇపుడు ఒక వైపు పోలింగ్ సాగుతూండగానే ఈ అల్లర్లు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

పల్నాడు జిల్లాలో గొడవలు జరిగితే బాధితులు ఇళ్ళు వదిలి పొలాలలో దాక్కున్నారు. అలాగే ఒక కోవెల ఉంటే అక్కడ తలదాచుకున్నారు. ఇక కేంద్ర పోలీస్ బలగాలు ఉండగానే లెక్కలేని తనంలో పెట్రో బాంబులు వేసుకున్నారు. వాహనాలకు నిప్పటించారు. కర్రలు రాళ్ళు ఇతర మారణాయుధాలతో వీధుల్లో స్వైర విహారం చేశారు.

ఈ రకమైన సంఘటననలు టీవీలలో చూసిన వారు ఏపీలోనే ఉన్నామా అని ఒకటికి రెండు సార్లు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకు ఇంతలా దాడులు జరుగుతున్నాయన్నది చూస్తే కనుక రాజకీయ కక్షలే అని అంటున్నారు ఎలక్షనీరింగ్ లో ఆధిపత్య పోరుతో మొదలైన గొడవలు కాస్తా పాత కక్షలకు బయటకు తీసుకోవడంతో అవి తారస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే గొడవలకు అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఓటమి భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారు అన్నది రెండు పార్టీలలోనూ కామన్ పాయింట్ గా ఉంది. అయితే వైసీపీ నేతలు బయటపడ్డారు మీడియా ముందుకు వచ్చి నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసు మహేష్ రెడ్డి వంటి వారు అయితే తమ ఓట్లు వేయించుకోకుండా పోలీసుల మద్దతుతో టీడీపీ క్యాడర్ రెచ్చిపోయారు అని ఆరోపించారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీకి చెందిన నరసారావుపేట ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు తో పాటు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు వైసీపీకి ఓటమి తప్పదని తెలిసి వచ్చిందని అందుకే ఈ విధంగా అసహనంతో దాడులకు తెర లేపారని విమర్శించారు. తమ ఓట్లు పడనీయకుండా చేయడానికే ఇదంతా అని వారు ఆరోపించారు.

ఇక ఇదే విషయం మీద డీజీపీని వైసీపీ నేతలు మంత్ర్లు కలిసి వినతి చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీసులు కొందరు టీడీపీకి అనుకూలంగా మారిపోయి వైసీపీకి మద్దతు ప్రాంతాలలో అలజడి సృష్టించారని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఒక రిటైర్డ్ అధికార్ దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం పోలీస్ అబ్జర్వర్ గా నియమించారని పై స్థాయి నుంచి పోలీసులకు టీడీపీకి అనుకూలంగా పనిచేయమని వత్తిళ్ళు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. దాని ఫలితమే అలజడులు ఘర్షణలు చెలరేగాయని, వీటి మీద తగిన చర్యలు కోసం డీజీపీని ఆశ్రయించామని వారు చెప్పుకొచ్చారు.

ఎవరు ఏమి చెప్పినా ఏపీలో లా అండ్ ఆర్డర్ కట్టు తప్పింది అని అంతా అంగీకరిస్తున్న విషయం. ఏపీలో ఆగని హింస మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఎస్ ని డీజీపీని స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీలో చావో రేవో అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో ఘర్షణలు సాగుతాయని అంతా ఊహించారు. దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడంలోనే వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

ఇక్కడ రాజకీయ పార్టీలు తమ స్వార్ధం కోసం తెగించి పనిచేస్తాయి. ఎందాకైనా వెళ్తాయి. కానీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు అని ఎన్నికల తీరు భారీగా జరిగిన హింసాత్మక ఘటనలు తెలియచేస్తున్నాయి. భారీ పోలింగ్ జరిగింది అని సంబరపడాలా లేక ఏపీ పరువు తీసే విధంగా హింస సాగిందని కొబ్బరి కాయల మాదిరిగా తలకాయలు పగిలిపోయాయని బాధపడాలా అన్నది పెద్ద ప్రశ్న. దీనికి బాధ్యులు ఎవరు అంటే ఈ ప్రశ్నకు జవాబు జాగ్రాత్తగా ఆలోచిస్తే ఎవరికి వారికే తోస్తుంది.