Begin typing your search above and press return to search.

శిరోముండనం కేసు... తీర్పు తర్వాత బాధితుల రియాక్షన్ ఇదే!

సభ్యసమాజం తలదించుకునే రీతిలో జరిగిన అమానవీయ వ్యవహారంపై తాజాగా విశాఖా కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 April 2024 7:43 AM GMT
శిరోముండనం కేసు... తీర్పు తర్వాత బాధితుల రియాక్షన్ ఇదే!
X

సభ్యసమాజం తలదించుకునే రీతిలో జరిగిన అమానవీయ వ్యవహారంపై తాజాగా విశాఖా కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దళితుల శిరోముండనం కేసులో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులే అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారంలోని బాధితులు తమ రియాక్షన్ వెల్లడించారు. నాడు జరిగిన దారుణాన్ని వివరిస్తూ.. నేటి తీర్పుపై స్పందించారు.

అవును... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం, వెంకటాయపాలెం గ్రామంలో డిసెంబరు 29 - 1996న దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు చేసిన ఘోరం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సమయంలో తాజాగా ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మందికి 18 నెలల జైలు శిక్ష విధించింది. ఈ సమయంలో బాధితులు స్పందించారు!

ఇందులో భాగంగా... ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు వాపోయారు. తోట త్రిమూర్తులు అప్పట్లో దగ్గరుండి గుండు గీయించారని.. తామంతా ఎంతో మానసిక క్షోభకు గురయ్యామని వెల్లడించారు. ఇదే సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను తమకు దూరం చేశారని వాపోయారు. ఇదే సమయంలో... అయిదేళ్లు వేయాల్సిన శిక్ష 18 నెలలు విధించారని.. ఈ కోర్టులో న్యాయం జరగలేదని, హైకోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అంటున్నారు.

ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన కోటి చినరాజు... త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని.. తోట త్రిమూర్తులు దగ్గరుండి గుండ్లు గీయించినందుకే ఆయనకు శిక్ష పడిందని.. ఇన్నాళ్లూ తమను ఎంతో వేదనకు గురిచేశారని మరో బాధితుడు కనికెళ్ల గణపతి అన్నారు.

నాడు తోట త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్‌ కు పాల్పడితే తాము అడ్డుకున్నామని చెప్పిన ఇంకో బాధితుడు చల్లపూడి పట్టాభిరామయ్య... అది మనసులో పెట్టుకుని తమపై ఈవ్‌ టీజింగ్‌ కేసు పెట్టించారని.. రెండేళ్ల తర్వాత శిరోముండనం చేశారని.. ప్రతిసారీ అధికారపార్టీలో ఉంటూ త్రిమూర్తులు తమపై ఒత్తిళ్లు పెంచేవారని.. బాధితులు ఎస్సీలు కారంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని తెలిపారు!