Begin typing your search above and press return to search.

ఏపీలో రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ?

అంటే ఏపీలో టీడీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పాటు కావచ్చు. అందులో జనసేన కూడా ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 2:30 AM GMT
ఏపీలో రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ?
X

తెలంగాణా రాజకీయాలలో అయోమయం మబ్బులు వీడినట్లుగా వీడిపోతున్నాయి. కొద్ది నెలల క్రితం వరకూ ట్రయాంగిల్ ఫైట్ గా తెలంగాణా రాజకీయ ముఖ చిత్రం ఉండేది. ఇపుడు చూస్తే అది కాస్తా ముఖా ముఖీ పోర్గుగా మారిపోతోంది. నామినేషన్లకు గడువు దగ్గర పడుతూంటే బీజేపీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

అంటే ముగ్గురు మధ్య పోటీ కాస్తా ఇద్దరు మధ్యకు మార్చడం అన్న మాట. నిజానికి బీజేపీ బలంగా ఉండడం బీయారెస్ కి కావాల్సి ఉంది. బీజేపీ ఎంత బలంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చితే అది అంతిమంగా బీయారెస్ కి లాభం. కానీ ఇపుడు బీజేపీ డీలా పడుతోంది. అన్ని కసరత్తు చేసి ఫస్ట్ లిస్ట్ ని 55 మందితో బయటకు తెస్తే దాని మీద ఒక రేంజిలో లొల్లి సాగుతోంది.

బీజేపీ లో వర్గ పోరు తారస్థాయిలో ఉంది. పాత కాపులు కొత్తగా వచ్చిన వారి మధ్య రగడ సాగుతోంది. బీయారెస్ నుంచి వచ్చి బీజేపీలో ఫోకస్ అవుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాటకే హై కమాండ్ ఎక్కువగా విలువ ఇస్తోంది అని అంటున్నారు. బీసీ సీఎం స్లోగన్ ఆయన్ని దృష్టిలో ఉంచుకునే అని అంటున్నారు. ఇక బీజేపీని ఒక స్థాయి దాకా ఎదగనిచ్చిన బండి సంజయ్ ని తప్పించడం ద్వారా బీజేపీ తన ఊపుని తానే తగ్గించేసుకుంది అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్న మాటలలో సత్యం ఉంది అంటున్నారు. ఏడాది క్రితం వరకూ బీజేపీ బీయారెస్ కి ప్రత్యర్ధిగా ఉందని, ఇపుడు ఆ ఊపు హుషార్ లేవని ఆయన విమర్శించారు. బీజేపీ కంటే కాంగ్రెస్ నే బీయారెస్ కి సరైన ఆల్టర్నేషన్ గా జనాలు నమ్ముతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీలో రెండవ జాబితా నవంబర్ రెండు తరువాత వస్తుంది అని అంటున్నారు. ఆ తరువాత మరెంత మంది పార్టీ మారుతారో కూడా తెలియని స్థితి ఉంది. ఇప్పటికైతే బీయారెస్ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కి పడే సీన్ కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తోంది. టీడీపీ గతసారి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. కొన్ని సీట్లలో పోటీ పడితే పడవచ్చు లేదా న్యూట్రల్ గా ఉండొచ్చు.

దాంతో టీడీపీ విషయంలో బీయారెస్ ఏమీ విమర్శలు చేయలేని పరిస్థితి ఉంది. ఇక తెలంగాణా ఎన్నికల్లో బీయారెస్ గెలవాలన్నది వైసీపీ ఉద్దేశ్యంగా ఉంది అని ప్రచారం సాగుతోంది. బీయారెస్ గెలిస్తే కచ్చితంగా అది 2024లో ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉండే అవకాశం ఉంది. అదే కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఏపీలో కూడా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతాయని అంటున్నారు.

చంద్రబాబు మాజీ శిష్యుడైన రేవంత్ రెడ్డే తెలంగాణా కాంగ్రెస్ ప్రెసిడెంట్. చంద్రబాబు ఇపుడు తన టోటల్ లైఫ్ లో ఎన్నడూ ఫేస్ చేయని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. నిరసనలు ఐటీ ఉద్యోగులు తెలుపుతామంటే కూడా బీయారెస్ ప్రభుత్వం కట్టడి చేసిందన్నది తెలిసిందే. అదే సమయంలో నిరసనలు ఎక్కడైనా చేసుకోవచ్చు అంటూ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయిన నేపధ్యమూ ఉంది.

టీడీపీ అనుకూల మీడియా సైతం రేవంత్ కి ఎక్కువగా ప్రచారం ఇస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ గెలిస్తే కనుక అది టీడీపీకి ఏపీలో రాజకీయంగా ప్లస్ అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అలా కనుక చూసుకుంటే రిటర్న్ గిఫ్ట్ అన్నది ఎవరికి అందుతుంది అంటే కచ్చితంగా వైసీపీకే అన్న మాట కూడా ఉంది అంటున్నారు. 2019 ఎన్నికల వేళ బీయారెస్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అదే తరహాలో ఇపుడు జరుగుతుందా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ తెలంగాణాల గెలిచిన తరువాత బలం పుంజుకోవచ్చు. ఆ తరువాత చంద్రబాబు వ్యూహాలు కూడా మారవచ్చు. ఇండియా కూటమి వైపు మొగ్గు చూపవచ్చు. అంటే ఏపీలో టీడీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పాటు కావచ్చు. అందులో జనసేన కూడా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణా పరిణామలౌ ఏపీలో కచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు ఏపీ పాలిటిక్స్ ని మరో వైపు తీసుకెళ్తాయని అంటున్నారు. దానికి 2019 ఎన్నికలను కూడా గుర్తు చేస్తూ ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఎవరికి అని ప్రశ్నిస్తున్నాయి. ఇక బీయారెస్ గెలిస్తే మాత్రం ఏపీలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.