Begin typing your search above and press return to search.

ఏపీలో పాలిటిక్స్ నా.. బొక్కా..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మరో నెలపది రోజుల్లో పోలింగ్ జరగబోతోంది

By:  Tupaki Desk   |   3 April 2024 12:30 AM GMT
ఏపీలో పాలిటిక్స్ నా.. బొక్కా..?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మరో నెలపది రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. పైగా ఈసారి జరిగేవి ఎన్నికలు కావు.. యుద్ధం అనే స్టేట్ మెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ను గద్దె దించడమే తమ లక్ష్యం అని కూటమి కంకణం కట్టుకుంటే... ఇవి ఎన్నికలు కాదు, పేదలకూ పెత్తందారులకూ మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ చెబుతున్నారు. వీరి వీరి స్టేట్ మెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... ఏపీలో ఎన్నికలపై కార్యకర్తలకే తప్ప సామాన్య ఓటరుకు, సాదారణ ప్రజానికానికి ఏమాత్రం ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యిందంటే... రాష్ట్రంలో నేతల కంటే జనాల్లోనే ఆ సందడి, ఆ వేడి ఎక్కువగా కనిపించేది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే... ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హడావిడి మరింత ఎక్కువగా కనిపించేది కూడా!! అయితే గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఫుల్ హీట్ లో నడిచాయి. కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా సాగిన ఆ ఎన్నికలు తెలంగాణతో పాటు ఏపీలోనూ హాట్ టాపిక్ గా మారాయి.

అయితే... ఎందుకో కానీ ప్రస్తుతం ఏపీలో ఆ సందడి కనిపించడం లేదు. ఒకప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ ఇద్దరు కలుసుకున్నా వారి మధ్య ఎలక్షన్ టాపిక్కే చర్చకు వచ్చేది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ నేత ఎలాంటి వారు.. ఎవరికి ఏమిటి ప్లస్ లు, మరెవరికి మైనస్ లు ఏమిటి అనే చర్చ నిత్యం జరుగుతూ ఉండేది! కానీ... ఇప్పుడు ఆ సందడే కనిపించడం లేదు. ఎవరివద్దైనా పొరపాటున ఎలక్షన్ విషయం ఎత్తితే... ఆ టాపిక్ తప్ప ఇంకేమైనా మాట్లాడుకుందాం అండీ అనే రిప్లై వస్తుండటం గమనార్హం.

అయితే... అందుకు ప్రధాన కారణం ఏమిటనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి 2019 ఎన్నికలనే తీసుకుంటే... ఒక రకమైన సందడి వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడి నెలకొంది. పైగా... ఆ సమయంలో జగన్ పాదయాత్ర చేస్తుండటం.. టీడీపీ ఎన్నికల ముందు ప్రజలకు తాయిలాలతో సరికొత్త రాజకీయానికి తెరలేపడంతో... రసవత్తరంగా మరిపోయింది వాతావరణం. ఎన్నికల ఫలితాలొచ్చిన కొన్ని రోజుల పాటు కూడా ఆ హీట్ తగ్గలేదన్నా అతిశయోక్తి కాదు!

అయితే... ప్రస్తుతం సాదారణ ప్రజానికం ఎవరూ ఎన్నికల సమయం అన్న విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నట్లుగా ఉందని అంటున్నారు. "మేమంతా సిద్ధం" అంటూ జగన్ బస్సు యాత్ర చేపడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు "ప్రజాగళం" అంటూ సభలు పెడుతున్న చంద్రబాబు.. జగన్ పై ఒక్కచొప్పున విరుచుకుపడుతున్నారు. ఇక పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల పరిస్థితి చెప్పేపనేలేదు!

ఇలా మూడు విమర్శలకు ఆరు ప్రతి విమర్శలుగా సాగుతున్న ఏపీ ఎలక్షన్ స్టంట్స్ లో నాయకులు, కార్యకర్తల పాత్ర తప్ప... సామాన్యుడి పాత్ర, ఆ సందడి మాత్రం కరువయ్యింది. దీంతో... ఎన్నికల ఫలితాలపై అంచనా వేయడానికి కూడా ఎక్కడ స్కోప్ దొరకడం లేదని.. ఫలితాలు వచ్చే వరకూ ఓటరు నాడిని ఒడిసిపట్టడం అంత సులువు కాదన్నట్లూగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు!

దీంతో... చెప్పిందే చెప్పి, అడిగిందే అడిగి, విన్న తిట్లె వింటుండటం వల్లో ఏమో కానీ... ప్రస్తుతం ఏపీలో కామన్ మ్యాన్ కామెంట్ కాస్తా... పాలిటిక్స్ నా.. బొక్కా..? అనే స్థాయికి చేరిందని తెలుస్తుంది!