Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ గడువు అప్పటితో సరి...ఈసీ ఆదేశాలు...!

ఏపీలో కొత్త ప్రభుత్వం ఎపుడు వస్తుంది. అసలు ఎపుడు రావాలి. దాని కంటే ఎన్నాళ్ళ ముందు ఎన్నికలు నిర్వహించాలి

By:  Tupaki Desk   |   21 Dec 2023 5:27 PM GMT
ఏపీ అసెంబ్లీ గడువు అప్పటితో సరి...ఈసీ ఆదేశాలు...!
X

ఏపీలో కొత్త ప్రభుత్వం ఎపుడు వస్తుంది. అసలు ఎపుడు రావాలి. దాని కంటే ఎన్నాళ్ళ ముందు ఎన్నికలు నిర్వహించాలి. ఇవన్నీ ప్రశ్నలే. కీలకమైన చర్చలే. అయితే ఏపీలో 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆనాడు 151 సీట్లతో వైఎస్ జగన్ గెలిచారు. ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి కుర్చీని అధిష్టించారు.

జగన్ మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అంటే ఫలితాలు వచ్చిన వారం తరువాత అన్న మాట. ఇక ఆయన మంత్రివర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించింది జూన్ 8వ తేదీన. అలా కొత్త సర్కార్ పూర్తిగా కొలువు తీరింది జూన్ 8వ తేదీన. ఈ విధంగా చూసుకుంటే ఏపీలో ప్రస్తుత ప్రభుత్వానికి చివరి గడువు జూన్ 16 దాకా ఉంది అని నిబంధనలు అంటున్నాయి.

అంటే ఈ రోజుకు చూస్తే ఆరు నెలలు అన్న మాట. అయితే ముందుగా ఎన్నికలు వస్తే ముందుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. మామూలుగా అయితే అదే జరగాలి. కానీ ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో లోక్ సభ ఎన్నికల ఫలితాలతోనే ముడిపెట్టి ఏపీ ఎన్నికల ఫలితాలను రిలీజ్ చేస్తారు.

అలా చూసుకుంటే కనుక ఎంత తొందరగా ఏపీలో ఎన్నికలు పెట్టినా కూడా ఫలితాలు మాత్రం ఆ తరువాత యాభై నుంచి అరవై రోజుల దాటిన తరువాతనే అని అంటున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది అనుకుంటే మార్చి నెలాఖరులో ఎన్నికలు జరగవచ్చు అంటున్నారు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా తొలిదశ లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతాయని అంటున్నారు. 2019లో ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి. ఈసారి పెరిగిన ఓటర్లు సమస్యాత్మకమైన ప్రాంతాలు అన్నీ తీసుకుంటే ఎనిమిది దశలుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు.అందుకే ఎన్నికలను ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు.

ఒక్కో దశకు మధ్య కచ్చితంగా నాలుగు నుంచి వారం రోజుల గడువు ఉంటుంది అలా చూసుకుంటే మొత్తం లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి రెండు నెలలు కచ్చితంగా పడుతుంది అని అంటున్నారు. ఆ తరువాత ఒకటి రెండు రోజులు చూసుకుని ఫలితాల ప్రకటన ఉంటుంది. అలా ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనాటికి మరో వారం వ్యవధి ఉంటుంది.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏ మాత్రం కంగారు అయితే లేదు. ఎందుకంటే జూన్ 16 వరకూ ఏపీ అసెంబ్లీకి గడువు ఉంది కాబట్టి. మొత్తానికి చూస్తే ఏపీలో ఎన్నికల అనంతరం కూడా దాదాపుగా రెండు నెలల పాటు జగన్ ఆపద్ద్ధర్మ సీఎం గా ఉంటారు అని అంటున్నారు. ఆ మీదట వైసీపీ మరోసారి గెలిస్తే ఆయనే సీఎం అవుతారు. సో వైసీపీకి ఏ విధంగా చూసినా తామే అధికారంలోకి వస్తామన్న నిబ్బరం ఉంది అని అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఏపీలో ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఏపీలో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారుల బదిలీలపై ముఖ్యమైన సూచనలు చేసింది.

ఎవరైనా అధికారులు సొంత జిల్లాల్లో పనిచేస్తున్నట్లు అయితే వారిని వెంటనే ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువకు కాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీచేయాలని ఈసీ ఆదేశించింది. పోలీసులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ ఈ నియమాలు వరిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే 2024లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఈసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గడువు జూన్ 16తో ముగియనుందని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించింది. దాంతో ఏపీలో ఎన్నికల మీద అందరికీ ఆసక్తి ఏర్పడుతోంది.