Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే సీటు నాదే అంటున్న వైసీపీ ఎంపీ

అది టీడీపీ ఎమ్మెల్యేకు కంచుకోట లాంటి సీటు. 2009లో అసెంబ్లీ పునర్వ్యస్థీకరణ తర్వాత విశాఖ తూర్పు నియోజకవ్ర్గం ఏర్పడింది

By:  Tupaki Desk   |   18 Sep 2023 4:03 AM GMT
టీడీపీ ఎమ్మెల్యే సీటు నాదే అంటున్న వైసీపీ ఎంపీ
X

అది టీడీపీ ఎమ్మెల్యేకు కంచుకోట లాంటి సీటు. 2009లో అసెంబ్లీ పునర్వ్యస్థీకరణ తర్వాత విశాఖ తూర్పు నియోజకవ్ర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నారు. ఇప్పటికి ముమ్మారు గెలిచిన ఆ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన వారు. ఆయనే వెలగపూడి రామక్రిష్ణబాబు. ఎక్కడో క్రిష్ణా జిల్లా నుంచి వచ్చి వ్యాపారం విశాఖలో చేసుకుంటూ వచ్చిన ఆయనకు 2009లో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కావడంతో లక్కీ చాన్స్ వచ్చింది.

అలా ఆయన 2009లో అటు వైఎస్సార్ హవాను, ఇటు మెగాస్టార్ చిరంజీవి వేవ్ ని తట్టుకుని తొలిసారి విశాఖ తూర్పులో గెలిచారు. 2014లో సైతం ఆయన టీడీపీ గాలిలో రెండవమారు గెలిచి ఏపీలో నాడు చంద్రబాబు తరువాత స్థానంలో అధిక మెజారిటీ సాదించిన నేతగా నిలిచారు. 2019లో ఆయన గెలుపు మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. జగన్ వేవ్ ఏపీ అంతటా బలంగా వీస్తున్న టైం లో కూడా పాతిక వేలకు తక్కువ కాకుండా ఓట్ల మెజారిటీని తెచ్చుకుని మరీ గెలిచిన ఆయన ఇక నాలుగవ సారి కూడా నల్లేరు మీద నడకే అనుకుంటున్నారు.

అయితే ఇపుడు ఆయనకు అంగబలం అర్ధబలంలో సమఉజ్జీగా ఉన్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రత్యర్ధి కాబోతున్నారు. చిత్రమేంటి అంటే 2019లో ఎంవీవీకి విశాఖ తూర్పులోనే టీడీపీ నుంచి ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది అని ప్రచారం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేకు పాతిక వేల మెజారిటీ వచ్చిన తూర్పులో ఆయన కంటే తక్కువ ఓట్లు ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి నిలబడిన శ్రీ భరత్ కి పడ్డాయి. దాంతోనే అతి తక్కువ తేడాలో ఆయన ఎంపీ సీటు కోల్పోయారు అంటారు.

మరి అది కాకతాళీయంగా జరిగిందా లేక ఏదైన తెర వెనక బంధమా అన్నది ఇప్పటికీ తేలలేదు కానీ ఇపుడు అయితే విశాఖ ఎంపీ తూర్పు కు వైసీపీ ఇంచార్జిగా నియమించబడ్డారు. నాడు తనకు ఎక్కువగా తూర్పు నుంచే ఓట్లు పడ్డాయని అది తనకు పాజిటివ్ ఓట్లుగా ఆయన చెప్పుకుంటున్నారు. ఈసారి తూర్పు నాది అని అయన బిగ్ సౌండ్ చేస్తున్నారు. తాజాగా ఎంపీ ఎంవీవీ పుట్టిన రోజు జరిగింది.

ఆయన ఫ్లెక్సీలు తూర్పు నియోజకవర్గంలో అంతటా వెలిశాయి. వాటిలో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఫోజులు ఇచ్చిన ఎంవీవీ తూర్పు నాదే అన్న కాప్షన్ పెట్టి మరీ రాజకీయ రచ్చకు తెర లేపారు. 2024లో విశాఖ తూర్పు సీటుని గెలిచి జగన్ కి గిఫ్ట్ గా ఇస్తాను అని అంటున్నారు. తనతో పోటీ పడేందుకు వెలగపూడి అసలు సరిపోరని కూడా ఆయన అంటున్నారు. తన మీద చంద్రబాబుని పోటీ చేయమని కూడా సవాల్ చేశారు.

బాబు వచ్చి తూర్పు లో పోటీ చేసినా తానే గెలుస్తాను అని రిజల్ట్ లో ఎక్కడా మార్పు ఉండదని ఢంకా భజాయిస్తున్నారు. మరి ఎంపీ గారిలో అంత ధీమా ఎలా వచ్చింది, దానికి కారణం ఏంటి అంటే కొంత వరకూ లాజిక్ కి అందే విషయాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మూడు సార్లు తూర్పులో గెలిచిన వెలగపూడి పట్ల సహజంగానే జనంలో వ్యతిరేకత ఉంది. ఈసారి మార్పుని వారు కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే విధంగా టీడీపీలో కూడా ఎందరో ఆశావహులు ఉన్నారు.

వారంతా ఈసారి టికెట్ తమకు వస్తుందని అనుకున్నా సిట్టింగులకే సీటు అని చంద్రబాబు ముందే డిక్లేర్ చేయడంతో ఆశలు నీరు కారాయి. వారంతా కూడా ఈసారి ఎమ్మెల్యే వెలగపూడి కి మనస్పూర్తిగా సహకరిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక వైసీపీ వచ్చిన తరువాత ఎమ్మెల్యే వెలగపూడి లిక్కర్ బిజినెస్ దెబ్బ తింది. ప్రభుత్వమే లిక్కర్ షాప్స్ నిర్వహించడంతో ఆర్ధికంగా ఆయన గతం కంటే ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు.

అదే వైసీపీ ఎంపీని తీసుకుంటే ఆయన విశాఖలో నంబర్ వన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ దిగ్గజంగా ఉన్నారు. ఆయనకు అర్ధబలంలో ఎవరూ సరితూగలేరు అంటున్నారు. వీటికి తోడు తనదైన స్ట్రాటజీ తో ఎంపీగారు ముందుకు దూసుకుని పోతున్నారు. వైసీపీకి కొరగాని కొయ్యలా ఉన్న విశాఖ తూర్పుని గెలుచుకుని వస్తాను అని అంటున్నారు. సో వెలగపూడిని మాజీని చేస్తే మాత్రం వైసీపీ సర్కార్ లో మినిస్టర్ ఎంవీవీ సత్యనారాయణే అంటున్నారు అంతా.