Begin typing your search above and press return to search.

శ్రీదేవిపై వారి కోపం అందుకేనా?

హైదరాబాద్‌ లో ప్రముఖ వైద్యురాలిగా ఉంటూ 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఉండవల్లి శ్రీదేవి

By:  Tupaki Desk   |   25 Aug 2023 7:11 AM GMT
శ్రీదేవిపై వారి కోపం అందుకేనా?
X

హైదరాబాద్‌ లో ప్రముఖ వైద్యురాలిగా ఉంటూ 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఉండవల్లి శ్రీదేవి. మొదట్లో శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని ప్రస్తుత గుంటూరు జెడ్పీ చైర్‌ పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా తదితరులు వ్యతిరేకించారు. 2014లో వైసీపీ తరఫున హెన్రీ క్రిస్టీనా తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లోనూ తనకు సీటు కావాలని కోరినా ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ అధినేత జగన్‌ సీటు ఇచ్చారు. ఆమె గెలుపొందినప్పటికీ నియోజకవర్గంలోని వైసీపీ దళిత నేతలు నిత్యం అసమ్మతి పోరు సాగించారు.

ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి ఓటేశారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో ఆమె టీడీపీకి దగ్గరవుతున్నారు. ఇటీవల నారా లోకేశ్‌ పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు శ్రీదేవి అందులో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమెను తాడికొండ నుంచి అసెంబ్లీకి లేదా బాపట్ల నుంచి పార్లమెంటుకు పోటీ చేయిస్తారనే టాక్‌ నడుస్తోంది. మరోవైపు ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి రావడాన్ని స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో తెనాలి శ్రావణ్‌ కుమార్‌ టీడీపీ తరపున పోటీ చేసి తాడికొండలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు శ్రీదేవి రాకతో ఆయనకు సీటు డోలాయమానంలో పడిందని అంటున్నారు. అలాగే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ కు ఒకవేళ సీటు ఇవ్వని పక్షంలో అమరావతి రాజధాని ఉద్యమనేత కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు శ్రీదేవికి సీటు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెనాలి శ్రావణ్‌ కుమార్, కొలికిపూడి శ్రీనివాసరావు ఆమెపై రుసరుసలాడుతున్నట్టు సమాచారం.

మరోవైపు వైసీపీలో ఉన్న నాలుగేళ్లు శ్రీదేవి అమరావతి రైతులను నిర్దాక్షిణ్యంగా అణచివేశారని.. తమపై పోలీసులు దాష్టీకాలకు తెగబడుతున్నా ఏనాడు తమకు అండగా నిలబడలేదని రాజధాని రైతులు కూడా ఆమెపై మండిపడుతున్నట్టు సమాచారం.

ఇంకోవైపు తాడికొండ నుంచి శ్రీదేవికి సీటు ఇవ్వకపోతే ఆమెను బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపుతారని అంటున్నారు. అయితే ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ తరఫున రంగంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పనబాకను తిరుపతి నుంచి పార్లమెంటుకు పోటీ చేయిస్తారని అంటున్నారు. శ్రీదేవిని బాపట్ల నుంచి పార్లమెంటుకు పోటీ చేయిస్తారని చెబుతున్నారు. దీంతో సహజంగానే పనబాక లక్ష్మి కూడా ఈ వార్తల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. మరి టీడీపీ అధిష్టానం వీరిని ఎలా చల్లబరుస్తుందో వేచిచూడాల్సిందే.