Begin typing your search above and press return to search.

మహిళా కమిషన్ ముందుకు గుడివాడ వస్తున్నారా ?

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు తాజాగా జారీ చేసిన సంగతి తెలిసిందే.

By:  Satya P   |   21 Jun 2026 9:54 AM IST
మహిళా కమిషన్ ముందుకు గుడివాడ వస్తున్నారా ?
X

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు తాజాగా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 24న ఉదయం పదకొండు గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆయన కనుక హాజరు కాకపోతే ఆయన హోం మంత్రి మీద చేసిన వ్యాఖ్యలను వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా తీసుకుని కేసు నమోదు చేస్తామని కూడా అదే నోటీసులో పేర్కొన్నారు. ఇక గుడివాడ తాను చేసిన వ్యాఖ్యలను ఆధారాలు ఉంటే కనుక వాటిని తీసుకుని కమిషన్ ముందుకు రావాలని కూడా నోటీసులో సూచించారు.

మ్యాటర్ వెరీ క్లియర్ :

ఇంత స్పష్టంగా ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ స్వతంత్ర్య ప్రతిపత్తి కలిగిన సంస్థ నుంచి నోటీసులు జారీ కావడంతో మాజీ మంత్రి గుడివాడకు ఈ కేసు బాగానే చుట్టుకోనుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఏ రకమైన ఆధారాలను తీసుకుని వెళ్ళగలరు అన్నది ఇక్కడ పాయింట్ గా ఉంది. ఆమె అన్నారు తానూ అన్నాను అని ఆయన ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి తాను చెప్పాల్సినది స్పష్టంగా చెప్పేశారు. ఇది మాటకు మాట అవుతుంది కానీ ఆధారం కాదు, పైగా మహిళా మంత్రిని కించపరచారు అని కూడా భావిస్తూ టీడీపీ శ్రేణులు అంతా ద్వజమెత్తిన నేపధ్యంలో మహిళా కమిషన్ సుమోటోగా ఈ కేసుని తీసుకుని ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యం ఉంది.

బిగుసుకున్నట్లేనా :

ఈ క్రమంలో మహిళా కమిషన్ ముందు గుడివాడ హాజరై సంజాయిషీ ఇచ్చుకుంటారా లేక గైర్ హాజరు అవుతారా అన్న చర్చ సాగుతోంది. ఆయన గైర్ హాజరు అయినా కూడా కేసు నమోదు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. దాంతో ఈ కేసు మాజీ మంత్రికి గట్టిగా బిగుసుకుంటుందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మరో వైపు చూస్తే తాను దేనిని అయినా ఎదుర్కొంటాను అని మాజీ మంత్రి చెప్పిన మాటలను కూడా అంతా గుర్తు చేసుకుంటున్నారు. దానిని బట్టి ఆయన ఈ అంశంలో కేసుల దాకా వచ్చినా కూడా రెడీ అయ్యారా అని కూడా ఆలోచిస్తున్నారు.

కమిషన్ వైపే అందరి చూపు :

ఇది కేవలం గుడివాడ అమర్నాధ్ ఇష్యూ అనే కాదు రేపటి రోజున మహిళలను ఎవరైనా ఏమైనా అంటే కూడా ఏ విధమైన పరిణామాలు ఉంటాయి అని చాటి చెప్పేలా కమిషన్ నిర్ణయం ఉండబోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో ఉన్న మహిళల మీద వారూ వీరూ అని కాదు చాలా మంది విమర్శల విషయంలో హద్దులు దాటుతున్నారు. అయితే వీటిని విమర్శలు గా తీసుకుంటూ వస్తున్నారు. కానీ సీరియస్ యాక్షన్ ఐతే పెద్దగా లేదు. ఇపుడు మహిళా కమిషన్ సుమోటోగా నోటీసులు జారీ చేయడంతో దీని మీద ఉత్కంఠ అయితే ఏర్పడింది. మరి గుడివాడ అమర్నాధ్ తాను చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారు అదే విధంగా కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో గుడివాడ ఈ నెల 24న వస్తారా రారా అన్నదే బిగ్ డిబేట్ గా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.