తెల్లకార్డు లెక్క తేల్చుడే !
ఏపీలో ఒక అంచనా ప్రకారం ఒక కోటీ యాభై లక్షల కుటుంబాలు తెల్లకార్డుదారులుగా ఉన్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 29 April 2025 9:06 AM ISTఏపీలో ఒక అంచనా ప్రకారం ఒక కోటీ యాభై లక్షల కుటుంబాలు తెల్లకార్డుదారులుగా ఉన్నారని అంటున్నారు. అయితే ఇందులో భోగస్ ఉన్నారన్న ప్రచారం చాలానే ఉంది అర్హత లేకపోయినా చాలా మంది గత ప్రభుత్వంలో తెల్లకార్డుని అందుకున్నారని అంటున్నారు.
ఇక తెల్ల కార్డు అంటే ప్రతీ సంక్షేమ పధకానికీ అవసరంగా ఉంది. అదే కొలమానంగా తీసుకుని పధకాలను అందిస్తున్నారు. ఏపీలో ప్రతీ దానికీ తెల్ల కార్డు అత్యంత ముఖ్యంగా మారిన నేపథ్యంలో అనర్హులను ఏరివేయకపోతే అర్హులకు ఇబ్బంది అవౌతుందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో తెల్లకార్డుదారులను లెక్క తేల్చేందుకు ప్రభుత్వం ఈకేవైసీ ముందుకు తెచ్చింది. ఈ కేవైసీ చేయించుకున్న వారికే తెల్ల రేషన్ కార్డు నిలుస్తుంది. దానికి చివరి గడువు మార్చి 31తో ముగిసేలా మొదట ప్రకటించారు. అయితే ఇంకా చాలా మంది ఈ కేవైసీ చేయించుకోవడంలేదని గడువు పొడిగించాలన్న వినతుల మీద ఏప్రిల్ 30 వరకూ దానిని పొడిగించారు.
దాంతో ఈ కేవైసీ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేవైసీ చేయించుకున్న వారికే ఇక మీదట తెల్లకార్డు దక్కనుంది అయితే అందులో కూడా ఒక లెక్క ఉందని అంటున్నారు ఈ కేవైసీ వివరాలు అన్నీ అడుగుతున్నారు. ఆధార్ కార్డుతో లోకల్ అడ్రస్ తో కూడిన వివరాలు తీసుకుంటున్నారు.
దాంతో ఆధార్ తో బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ తెలుస్తాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారుల కోసం విధించిన నిబంధనలనకు కరెక్ట్ గా ఉన్న వారే కార్డు హోల్డర్లు అవుతారు. అలా కాని వారు అంతా రేషన్ కార్డుని కోల్పోతారని అంటున్నారు.
ఇక ఈ కేవైసీలో లోకల్ గా ఉన్న వారికే అవకాశం అని చెప్పారు లోకల్ చిరునామాతో ఉన్న వారే కార్డు పొందుతారు. వేరే చోట్ల ఉంటూ ఏపీలో కార్డుని అందుకున్న వారు లబ్ది పొందుతున్న వారు ఈ దెబ్బతో అవుట్ అవుతారు. అంతే కాదు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేసినా లేక లబ్ది పొందినా కూడా వారికి ఈ కార్డు దక్కదు. కారు ఉన్నా 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం ఉన్నా ఇతర మార్గాల ద్వారా ఆదాయ ఆర్జన ఉన్నా అన్నీ లెక్క చూసి మరీ కార్డు కోత పెడతారు. ఇలా చాలా రూల్స్ ఉన్నాయి.
అందుకే తెల్ల రేషన్ కార్డుదారుల గుండెలలో గుబులు రేగుతోంది. అయితే అసలైన పేదలకు అన్యాయం జరగదు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఎవరైనా అర్హత ఉండి కార్డు లేకపోతే పెట్టుకునే వీలు కల్పిస్తామని అంటున్నారు.
ఇక స్మార్ట్ కార్డుల తరహాలో కొత్తగా రేషన్ కార్డులను తయారు చేసి జూన్ నుంచి పంపిణీ చేస్తారు అని అంటున్నారు వాటి వల్ల బహుళ ప్రయోజనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తం మీద ఈ కేవైసీ ముగిసిన తరువాత తెల్ల రేషన్ కార్డుదారులు ఏపీలో ఎంత మంది అన్నది తేలుతుంది అని అంటున్నారు. నకిలీ భోగస్ ఇక కనిపించరని అంటున్నారు. అనర్హులకు పధకాలు ఇవ్వడం వల్ల ఖజానా భారం తప్ప ఏమీ ఉండదని అంటున్నారు. మొత్తం మీద తెల్ల కార్డు దారులమని భోగస్ తో హవా చలాయించాలనుకునే వారే ఈ కేవైసీ దెబ్బతో తెల్ల ముఖం వేయాల్సిందే అని అంటున్నారు.
