Begin typing your search above and press return to search.

సచివాలయానికి శాశ్వత పాతర...కొత్త బోర్డులొచ్చేశాయ్

సచివాలయాలు అన్నది పాత కధ. ఆ పేరు ఇక మీదట అంతా మరచిపోవాల్సిందే. వైసీపీ ప్రభుత్వం 2019 అక్టోబర్ 2న గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.

By:  Satya P   |   18 July 2026 9:12 AM IST
సచివాలయానికి శాశ్వత పాతర...కొత్త బోర్డులొచ్చేశాయ్
X

సచివాలయాలు అన్నది పాత కధ. ఆ పేరు ఇక మీదట అంతా మరచిపోవాల్సిందే. వైసీపీ ప్రభుత్వం 2019 అక్టోబర్ 2న గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక సచివాలయాల మీద పూర్తి స్థాయి అధ్యయనం చేస్తూ వచ్చింది. దానితో ఆ మధ్యన వాటి పేర్లను మార్చేసింది.స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా వాటికి కొత్త పేర్లు పెట్టింది. అయినా సరే ఈ రోజుకీ వాటిని సచివాలయాలుగానే జనాలు పిలుస్తున్నారు. కేవలం కాగితాల మీదనే ఆ పేర్లు ఉన్నాయి. దాంతో కూటమి ప్రభుత్వం ఇపుడు వాటి పేర్లు అందరికీ పెద్దగా కనిపించేలా నేమ్ బోర్డులు తయారు చేయిస్తోంది. ఎక్కడికక్కడ కొత్త పేర్లతో బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా ఇక మీదట సచివాలయాలు అన్న మాట లేకుండా స్వర్ణ వార్డులుగానే వాటిని గుర్తించాలని గట్టి నిర్ణయం తీసుకుంది.

కీలక ఉత్తర్వులతోనే :

ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం 15 వేల పై చిలులు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయాలు ఉన్నాయి. వీటి పేర్లను మారుస్తూ కొత్త నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఈ కొత్త బోర్డులు ఎలా తయారు చేసి ఉంచాలో కూడా సూచనలు చేసింది. ఆరు ఎం ఎం అక్రిలిక్ మరియు ఏసీపీ 3*8 అడుగుల నేమ్ బోర్డులను తయారు చేయించాలని దిశా నిర్దేశం చేసింది. ఈ తయారీ అలాగే సరఫరా బాధ్యతలను గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నెక్స్టోరా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టెండర్ ద్వారా అప్పగించారు.

వేగంగా పూర్తి చేయాలి :

ఈ కొత్త బోర్డుల తయారీతో పాటు వాటిని ఏర్పాటు విషయం అంతా వేగంగా జరగాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ బోర్డుల పంపిణీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఈ ఉత్తర్వులలో ఆదేశించారు. అదే విధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు, మండల, అర్బన్ ఎస్జీ ఎస్ డబ్ల్యూ అధికారులు ఈ బోర్డులను స్వాధీనం చేసుకుని ప్రతీ కార్యాలయం వద్ద సరిగ్గా అమర్చాలని ఆదేశించింది. ఈ. బోర్డులు మంచి స్థితిలో అందినట్లుగా నిర్ధారించుకుని సంబంధిత అధికారులు సంతకంతో పాటు అధికారిక ముద్ర కూడా వేయాల్సి ఉంది. ఇలా సరఫరా అయిన బోర్డుల వివరాలను స్టాక్ రిజిస్టర్‌లో భద్రపరచాలని జిల్లా కో-ఆర్డినేటర్లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని కూడా ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

జనంలో నాటుకు పోవాలనే :

సచివాలయం అంటూ జనంలో బాగా వెళ్ళిపోయింది. వాటి రంగులు కూడా వైసీపీ పార్టీ జెండాలను పోలి ఉంటున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ పార్టీల రంగులను ఎక్కడా ఉపయోగించరాదని కీలక నిర్ణయం తీసుకుంది. ఇపుడు దానికి తగినట్లుగానే ఆచరణలో పెడుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో బోర్డులు కనుక పెద్దగా ప్రతీ కార్యాలయం ముందు పెడితే జనంలో ఇవే పేర్లు బాగా నాటుకు పోతాయని అంటున్నారు. అయితే తాము ప్రారంభించిన ఈ వ్యవస్థను జనాలు ఎవరెన్ని చేసినా గుర్తుంచుకుంటారని వైసీపీ నేతలు మరో వైపు వాదిస్తున్నారు.