శ్రీవారి క్షేత్రంలో రాజకీయం అవసరమా? టీడీపీ, వైసీపీ దొందూ.. దొందే..
ఏపీలో రాజకీయాలంటే చాలా కష్టం.. ప్రతి అంశం రాజకీయ కోణంలో చూడటం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుందని అంటుంటారు.
By: Tupaki Desk | 17 April 2025 11:10 AM ISTఏపీలో రాజకీయాలంటే చాలా కష్టం.. ప్రతి అంశం రాజకీయ కోణంలో చూడటం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుందని అంటుంటారు. రెండు బలమైన ప్రాంతీయ పార్టీల పోరుగడ్డ అయిన రాష్ట్రంలో సున్నితమైన అంశాలపై రాజకీయాలు చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మరణం మిస్టరీని రెండు మతాల మధ్య వివాదంగా మలిచేలా ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. పాస్టర్ మరణంపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోయినా, సంబంధం లేని వ్యక్తులు ఇష్టానుసారం మాట్లాడం, ఓ మతానికి చెందిన వారు ఆందోళనలకు దిగడం వివాదంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే పోలీసులు చాకచక్కంగా పాస్టర్ కేసు మిస్టరీని ఛేదించి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారనగా, తిరుపతి ఎస్వీ గోశాల వివాదం మరింత రచ్చగా మారుతోంది.
తిరుపతి ఎస్వీ గోశాలలో వంద ఆవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణ తీవ్ర దుమారం రేపింది. దీనిపై వాస్తవాలు, నిజానిజాలు ఏంటో నిర్ధారించుకోవాల్సిన రాజకీయ పక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తూ రాజకీయ వివాదంగా మాల్చడంతో సున్నితమైన అంశం కాస్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాలు గోశాలను సందర్శించాలని నిర్ణయించడంతో తిరుపతిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిజానికి పవిత్ర శ్రీవారి క్షేత్రంలో ఇలాంటి రాజకీయాలు జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఇరుపక్షాలు సంయమనం పాటించాల్సిందిపోయి, రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటంపై భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల గోశాలలో వంద ఆవులు చనిపోవడానికి కారణం ఎవరు? బాధ్యులపై చర్యలు తీసుకునే అంశాలు తెరమరుగై తప్పు మీదంటే మీదన్న వాదన తెరపైకి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడులో బాధ్యుడైన వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చారని చెబుతున్న అధికారపార్టీ అతడిపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన మరుక్షణమే బాధ్యుడిని శిక్షిస్తే, ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు. అదేసమయంలో తనకు సమాచారమిచ్చిన వ్యక్తి సరైన వారా? కాదా? అని నిర్ధారించుకోకుండా సీనియర్ నేత భూమన ఆరోపణలు చేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతున్న వైసీపీ, గోశాలలో మూగజీవాల మరణాన్ని రాజకీయం చేయాలని చూడటం ఎంతవరకు కరెక్టు అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. లడ్డూ విషయంలో టీడీపీ చేసింది తప్పు అయితే ఇప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వైసీపీ కూడా తప్పు చేసింది కదా? అంటూ నిందిస్తున్నారు.
ఏదిఏమైనా గోశాలలో పశువులు మరణిస్తున్నాయనే అంశం ఈ వివాదంతో నిజమని అంతా నమ్మాల్సివస్తోందని అంటున్నారు. అయితే ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అనే విషయమై పోస్టుమార్టం జరగకుండా పరస్పరం నిందించుకోవడం వల్ల ఉపయోగమేముంటుందని అంటున్నారు. ప్రధానంగా తనను ఉద్యోగం నుంచి తీసేశారనే అక్కసుతో ఓ మాజీ అధికారి తన హయాంలో జరిగిన తప్పులను తాజా పొరపాటుగా చిత్రీకరించడం.. అతడి బుట్టలో ప్రతిపక్షంతోపాటు అధికారపక్షం పడటం చర్చకు తావిస్తోంది. ఇప్పటికైనా బాధ్యుడిపై చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చూడాలని డిమాండ్ వినిపిస్తోంది.
