Begin typing your search above and press return to search.

స్టాప్ ఉన్న చోట ఆగని బస్సులు.. స్త్రీశక్తితో పరేషాన్

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ పలు రకాల సమస్యలతో ప్రయాణికులు విసిగిపోతున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   23 July 2026 9:00 PM IST
స్టాప్ ఉన్న చోట ఆగని బస్సులు.. స్త్రీశక్తితో పరేషాన్
X

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ పలు రకాల సమస్యలతో ప్రయాణికులు విసిగిపోతున్నారని అంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి మేలు కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. గత ఏడాది ఆగస్టు 15న అమలులోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఏడాదిలో చాలా రకాల సమస్యలు పథకంపై అసంతృప్తిని రాజేస్తున్నట్లు చెబుతున్నారు. ఉచితం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బస్సుల సమయపాలన తప్పడమే కాకుండా, చేయి ఎత్తిన చోట బస్సులు ఆపకపోవడం, సీట్ల కోసం కొట్టుకోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా బస్సు సిబ్బందిపై ఒత్తిడి కూడా ఎక్కువైందని అంటున్నారు.

బస్సులు కిటకిట

స్త్రీశక్తి పథకం కింద ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ ప్రెస్ సర్వీసులతోపాటు ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్ సర్వీసులు కొంతవరకు సక్రమంగా నడుస్తున్నా, మిగిలిన నాలుగు రకాల బస్సులు పరిమితికి మించిన సామర్థ్యంతో తిరుగుతున్నాయి. మహిళల ప్రయాణాలు రెట్టింపు కావడంతో ఏ బస్సు చూసినా ఖాళీ ఉండటం లేదు. దీంతో బస్సులు ప్రయాణికులు కోరిన చోట ఆపడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అదేసమయంలో స్టాండుల్లోనే బస్సులు నిండిపోవడంతో గ్రామీణ స్టాపుల్లో బస్సులు నిలపడం లేదని అంటున్నారు. దీనివల్ల చాలా చోట్ల డ్రైవర్లు, ప్రయాణికులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందిపై దాడులు జరుగుతున్న ఫిర్యాదులు అందుతున్నాయి.

సిబ్బందిపై అదనపు భారం

ఉచిత బస్సు పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని అమలులోకి తీసువచ్చినట్లు ప్రారంభంలోనే స్పష్టత ఇచ్చింది. అయితే ఈ ఏడాదిలో ఎదురైన అనుభవాలతో క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా రద్దీకి తగినట్లు బస్సులు, సిబ్బంది లేకపోవడం ప్రధాన అవరోధంగా మారిందని చెబుతున్నారు. స్త్రీశక్తి పథకంలో మహిళా ప్రయాణికులకు సంబంధించి ప్రభుత్వం టికెట్ల ధరలు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నా, ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆర్టీసీ చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా బస్సులు మరమ్మతులతో రద్దు చేయడం, సర్వీసులో ఉన్న బస్సులు సమయపాలన లేకుండా తిరుగుతుండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అదనపు బస్సులు సమకూర్చుకుంటే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా, ఆర్టీసీ ఆ దిశగా దృష్టి పెట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.