Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్‌లో బాబు మార్కు ప‌క్కా.. !

వచ్చే నెల 14న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి ఈ ద‌ఫా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

By:  Garuda Media   |   2 Feb 2026 1:00 AM IST
బ‌డ్జెట్‌లో బాబు మార్కు ప‌క్కా.. !
X

వచ్చే నెల 14న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి ఈ ద‌ఫా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇదే కావడం ఒక విశేషం. అయితే గత రెండు బడ్జెట్లలోను లోటును ఎక్కువగా చూపించారు. రాష్ట్రానికి ఆదాయం లేదని, అదే విధంగా గత వైసిపి ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు.. లేదా ఆర్థిక వ్యవస్థ పతనమైన కారణంతో 2024లో ప్రవేశపెట్టిన మ‌ధ్యంత‌ర‌ బడ్జెట్. 2025-26ల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ల విషయంలో ప్రభుత్వం ఒకంత జాగ్రత్తగా వ్యవహరించింది.

అయితే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే 2026- 27 వార్షిక బడ్జెట్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గడిచిన 18 మాసాలుగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండడం.. ఆర్థికంగా పుంజుకున్నామని చెబుతున్న క్రమంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ఇంకో కారణం కూడా ఉంది.. వచ్చే ఏడాది ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ కి ఎన్నికల ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అప్పటికి దాదాపు ఎన్నికలు దగ్గర పడతాయి.

అప్పుడు పూర్తిగా సంక్షేమానికి కేటాయింపులు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. కానీ ఇప్పుడు ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో మాత్రం ఇది ప్రభుత్వానికి అత్యంత కీలకమైంది. అభివృద్ధి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే కేటాయింపులు ఈ బడ్జెట్ లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉండాలని కూడా ఆర్థిక నిపుణులు కోరుకుంటున్నారు. ప్రధానంగా 2028 నాటికి తొలిదశ రాజధాని పని పూర్తి కావాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో అమరావతి రాజధానికి అధికంగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తద్వారా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరోవైపు రుణాలుగా తీసుకొచ్చిన మొత్తంతో కలిపి అమరావతి రాజధాని ముఖ్యంగా తొలి పనులను 2028 నాటికి పూర్తి చేయడం ద్వారా 2029 లో జరిగే ఎన్నికలకు దానిని ప్రధానంగా వినియోగించుకునే అవకాశం ప్రస్తుత కూటమి పార్టీలకు ఉంటుంది. దీంతో అమరావతికి కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవి ధంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా ఈ దఫా రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం ఉంటుందని ఒక అంచనా.

ఎందుకంటే ఇది కూడా 2027 -28 నాటికి సగమైనా పూర్తి చేసి నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. తద్వారా గతంలో జగన్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం అయిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు జవసత్వాలు ఇచ్చామని చెప్పుకునేందుకు ప్రభుత్వానికి ఒక ఆయుధంలా మారే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రెండు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎక్కువ కేటాయింపులు చేసుకునే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. అట్లాగే తల్లికి వందనం పథకాన్ని ఈ ద‌ఫా మరింత మందికి అమలు చేయాల్సి రావచ్చు.

ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ ఇటీవల అంచనా వేసింది. దీంతో దానికి కూడా నిధుల కేటాయింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలు కల్పనకు ముఖ్యంగా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఐటీ రంగానికి కేంద్రంగా మారుస్తున్న విశాఖను ఇప్పటికే అతిపెద్ద జిల్లాగా భావిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపేట వెయ్యనున్నారు. అట్లాగే అమరావతి ప్రాంతాన్ని విజయవాడతో అనుసంధానిస్తూ ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులకు కూడా ఈ దఫా బడ్జెట్లో సింహభాగం కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలా చూసుకున్నా 2026 -27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా అయితే మారిందని చెప్పాల్సింది ఉంటుంది.