దేశంలో ఎక్కడైనా రేషన్...కూటమి అద్భుత ఆలోచన !
రేషన్ కార్డు అంటే ఇప్పటిదాకా పార్టీల రంగులు ఉండేవి. ఎవరు సీఎం అయితే వారి బొమ్మ ఉండేది.
By: Tupaki Desk | 6 May 2025 2:30 PMరేషన్ కార్డు అంటే ఇప్పటిదాకా పార్టీల రంగులు ఉండేవి. ఎవరు సీఎం అయితే వారి బొమ్మ ఉండేది. కార్డు కూడా పొడవుగా ఉంటూ జేబులో పట్టకుండా చేతికి చిక్కకుండా ఉండేది. ఇక ప్రతిసారీ ప్రభుత్వం మారినపుడు పార్టీ రంగులతో ఉండే రేషన్ కార్డుల మార్పు అనివార్యం అవుతోంది.
అలాగే కార్డులు కూడా వాడుతూ పోవడం వల్ల అవి నాసిరకం గా తయారై పేర్లు కూడా కనిపించని నేపథ్యం ఉండేది. దీంతో టీడీపీ కూటమి సర్కార్ రేషన్ కార్డుల విషయంలో వినూత్న ఆలోచన చేసింది. స్మార్ట్ కార్డుల మాదిరిగా రేషన్ కార్డులను డిజైన్ చేసి అందించాలన్న ఆలోచన గొప్పగా ఉంది.
అంతే కాదు క్యూ ఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ కార్డుని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వివరాలు వస్తాయి. అంతే కాదు గత ఆరు నెలలుగా వారు తీసుకున్న రేషన్ తాలూకా వివరాలు సైతం కనిపిస్తాయి.
దాంతో ఇది సమగ్రంగా ఉంటుంది అటు ప్రభుత్వానికీ ఇటు రేషన్ కార్డు దారులకూ ఉపయోగపడేలా ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే దేశంలో ఎక్కడైనా ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో రేషన్ తీసుకోవచ్చు. ఇది నిజంగా చాలా మందికి ఉపయోగపడే వ్యవహారమే. చాలా మంది ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారు వారికి రేషన్ కార్డు ఉంది అన్న మాటే కానీ వాడకం లేదు.
దాంతో ఆ కార్డులు మురిగిపోతున్నాయి. అంతే కాదు మూడు నెలల గ్యాప్ లో ఒక్కసారి అయినా రేషన్ తీసుకోకపోతే ఏకంగా కార్డు రద్దు అవుతుంది. దాంతో వారు ఎక్కడ ఉన్నా కూడా రేషన్ కోసం పరిగెత్తుకుని వెనక్కి సొంత వూరుకు రావాల్సి వస్తోంది. పేదలకే ఎక్కువగా రేషన్ కార్డుల అవసరం ఉంది, వారే వలస పోతున్నారు.
ఇపుడు ఆ ఇబ్బంది లేకుండా దేశంలో ఎక్కడైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు రేషన్ తీసుకోవచ్చు. ఇది మంచి విధానంగానే అంతా చూస్తున్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్ రేషన్ కార్డులను జూన్ నుంచి మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇక కొత్తగా రేషన్ కార్డుల కోసం దరకాస్తు చేసుకోవాలని అనుకున్న వారు మే 7 నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. సచివాలయాలతో పాటు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా వీటిని తీసుకుంటారు. మే 12 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఏపీలో అధికార లెక్కల ప్రకారం 1.50 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాల్సి ఉంది అని అంటున్నారు. ఈ కేవైసీ చేసుకున్న వారు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డుల కోసం దరకాస్తు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.