డబ్బులు ఊరకే ఖర్చు అయిపోతున్నాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ ద్రవ్యోల్బణ ప్రభావం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భిన్నంగా ఉన్నప్పటికీ, అన్ని వర్గాల ప్రజలపై సమానంగా భారం పడుతోంది.
By: Tupaki Political Desk | 17 July 2026 3:51 PM ISTఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. వరుసగా ఐదో నెలలోనూ రాష్ట్రంలో రిటైల్ ద్రవ్యోల్బణం జాతీయ సగటును మించి నమోదవ్వడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అధిక ధరలు ఆర్థిక వ్యవస్థపైనా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 3.9 శాతంగా నమోదవగా, ఏపీలో ఇది ఏకంగా 4.9 శాతానికి చేరింది. గత అక్టోబర్ 2025లో కేవలం 0.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు, ఏడు నెలల స్వల్ప వ్యవధిలోనే 4.9 శాతానికి పెరగడం అత్యంత ఆందోళనకరమైన పరిణామంగా విశ్లేషిస్తున్నారు.
ఈ ద్రవ్యోల్బణ ప్రభావం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భిన్నంగా ఉన్నప్పటికీ, అన్ని వర్గాల ప్రజలపై సమానంగా భారం పడుతోంది. తాజా గణాంకాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.09 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 4.61 శాతంగా నమోదైంది. పల్లెల్లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.91 శాతానికి చేరగా, పట్టణాల్లో ఇది 5.44 శాతంగా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రజల చేతిలో డబ్బు నిల్వ ఉండటం కష్టతరంగా మారిందని అంటున్నారు.
అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న విభాగాల్లో పర్సనల్ కేర్ (వ్యక్తిగత అవసరాలు) ముందు వరుసలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ విభాగంలో ధరలు ఊహించని స్థాయిలో పెరగడం సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పర్సనల్ కేర్ విభాగంలో 24.79 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.71 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. సబ్బులు, టూత్‌పేస్ట్‌ల వంటి నిత్యం వాడే వస్తువులతోపాటు, సెలూన్ ఖర్చులు, టైలరింగ్ ఛార్జీలు సైతం గణనీయంగా పెరిగాయని అంటున్నారు.
వీటితో పాటు పట్టణాల్లో విద్యా రంగంలో ద్రవ్యోల్బణం 7.36 శాతంగా నమోదుకావడం మధ్యతరగతికి పెను భారంగా మారింది. స్కూల్ ఫీజులు, పుస్తకాల ధరలు పెరగడం కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని అంటున్నారు. నిత్యావసరాల నుండి సేవల వరకు ప్రతి రంగంలో ధరల పెరుగుదల కారణంగా, గతంలో రూ. 10 వేల బడ్జెట్‌తో నెట్టుకొచ్చిన ఒక సామాన్య కుటుంబం, ఇప్పుడు అదనంగా మరో రూ.వెయ్యి, రెండు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం నిత్యావసరాల ధరలను అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
