Begin typing your search above and press return to search.

డీమార్ట్ కన్నా తక్కువ ధరలకు సరుకులు.. చంద్రన్న విలేజ్ మార్టులకు ప్లాన్

ఏపీలో రేషన్ దుకాణాలలో అన్ని రకాల సరుకులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   27 Nov 2025 5:54 PM IST
డీమార్ట్ కన్నా తక్కువ ధరలకు సరుకులు.. చంద్రన్న విలేజ్ మార్టులకు ప్లాన్
X

ఏపీలో రేషన్ దుకాణాలలో అన్ని రకాల సరుకులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తున్న సరుకులను మాత్రమే రేషన్ దుకాణాలలో విక్రయిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులతోపాటు ఇతర సామగ్రిని వినియోగదారులకు అందుబాటు ధరలలో విక్రయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనివల్ల రేషన్ డీలర్లకు ఆదాయం పెరగడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుతాయని అంచనా వేస్తున్నారు.

రేషన్ షాపులను విలేజ్ మాల్స్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెలా పేదలకు అందిస్తున్న రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయడంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా రేషన్ షాపులలో సరసమైన ధరలకు విక్రయించాలని భావిస్తున్న సర్కారు విలేజ్ మాల్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 వేల రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చే ప్రక్రియపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోని పౌరసరఫరా అధికారులు ప్రాథమిక ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని అంటున్నారు.

ఈ విషయంపై రేషన్ డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో అధికారులు చర్చలు జరిపారు. ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ పేరుతో రేషన్ షాపులను అభివృద్ధి చేసే ఆలోచనలను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులను రీ మోడలింగ్ చేయడంతోపాటు సూపర్ మార్కెట్ల తరహాలో అందంగా షాపులను తీర్చిదిద్దాలని భావించారు. అయితే షాపులకు అదనపు హంగులు కల్పించాలంటే ఆర్థిక భారం అవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు ఆర్థికంగా తట్టుకోలేరని సంఘాల నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

యథావిధిగా షాపులను కొనసాగిస్తూనే విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో తాము విక్రయించే సరుకుల ధరలు సూపర్ మార్కెట్లైన డీమార్ట్ వంటి సంస్థలు విక్రయించే ధర కన్నా తక్కువగా ఉండేలా చూడాలని కోరారు. అదే సమయంలో విలేజ్ మాల్స్ నిర్వహణకు బ్యాంకులతో రుణాలు ఇప్పించాల్సిందిగా వేడుకున్నారు. ఇదే సమయంలో మరికొందరు డీలర్ల ప్రతినిధులు కల్పించుకుని నిత్యావసరాలైన పప్పు దినుసులు, ఉప్పు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర పది హేను రకాలైన సరుకులు ఉంటే సరిపోతుందని, మాల్స్ మాదిరిగా అన్ని రకాల సరుకులు అందుబాటులో ఉంచడం కష్టమవుతుందని ప్రభుత్వానికి నివేదించారు.

ఇక ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, పంచదార, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి తృణధాన్యాలు కొరత లేకుండా చూడాలని కోరారు. డీలర్ల అభిప్రాయాలను సేకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి దీనిపై సమగ్రంగా చర్చిద్దామని ప్రతిపాదించారు. దీంతో రేషన్ షాపుల స్వరూపం మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.