పోలింగ్ కేంద్రానికి పక్కాగా ఓటర్లు అంతేనట !
ప్రతీ పోలింగ్ బూత్ లో దాదాపుగా సమానంగా ఓటర్లు ఉంటే ఓటర్లకు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం వస్తుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2025 9:15 AM ISTదేశంలో స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం అమలు అయ్యాక 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్నో సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రాలలో అయితే వందల సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్ బూత్ ల విషయంలో ఎపుడూ చర్చ సాగుతూనే ఉంది. అవి తమ ఊరికి దూరంగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తూంటాయి. అలాగే ఎక్కువగా ఓటర్లు ఒకే పోలింగ్ బూత్ లో ఉండడం వల్ల సకాలంలో ఓటు వేయలేకపోతున్నామని కూడా అంటుంటారు. భారీ ఎత్తుల క్యూలైన్లని చూసి చాలా మంది ఓటు వేయకుండానే బయటకు వెళ్ళిపోతారు. ఇవన్నీ సరిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
తాజాగా ఉత్తర్వులు :
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని పోలింగ్ బూతులలో ఓటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రేషనలైజేషన్ విధానం తీసుకుని రావాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రతీ పోలింగ్ బూత్ లో 1200 మంది కంటే ఓటర్ల సంఖ్య మించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మీదట ఎక్కువ అయితే కొత్తగా సమీపంలోనే పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేయాలని కూడా ఈసీ సూచించినట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఓటర్లలో ఉత్సాహం :
ప్రతీ పోలింగ్ బూత్ లో దాదాపుగా సమానంగా ఓటర్లు ఉంటే ఓటర్లకు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం వస్తుంది అని అంటున్నారు. తాము ఎక్కువ సేపు క్యూలో నిలవకుండా ఓటు వేయవచ్చు అని వారు అనుకుంటారు. ఓటు వేసేందుకు కనీసం అయిదు నుంచి ఏడు నిముషాలు సమయం పట్టినా కూడా అంత ఇబ్బంది అనిపించదని అంటున్నారు. అలా కాకుండా ఒక కేంద్రంలో వేయి మంది లోపు మరో చోట పదిహేను వందలకు పైగా ఓటర్లు ఉంటే ఓటర్లు కూడా పెద్ద పోలింగ్ బూత్ లో తమ ఓటు ఉందని భావించి అంత సేపు ఉండలేక ఓటు హక్కునే వినియోగించుకోరని అంటున్నారు.
ఏపీలో రేషనలైజేషన్ :
ఇదిలా ఉంటే ఏపీలో ఈసీ ఉత్తర్వుల నేపథ్యంలో పన్నెండు వందలు కంటే అధికంగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ రేషనలైజేషన్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. వారి సమక్షంలోనే ఈ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహిందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇక ఏపీకి రాజకీయంగా గుండె కాయ లాంటి గుంటూరు జిల్లాలో ఈ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇక్కడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పన్నెండు వందల మందికి మించిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను అదే ప్రాంతంలో మరొక కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
అంతా సజావుగానే :
అదే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో 291 ఉండగా ప్రస్తుతం మరో 48 కేంద్రాలు కలిపి మొత్తం 339 కేంద్రాలు ఉన్నాయని, తూర్పు నియోజకవర్గంలో గతంలో 256 కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 56 కేంద్రాలు కలిపి మొత్తంగా 312 కేంద్రాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆయా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి సూచనలు తీసుకున్నామని, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆయా పోలింగ్ కేంద్రాల పేర్లు చిరునామాలు మార్పులు ఉంటే వాటిని కూడా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని వివరాలను తమకు అందించాలని అధికారులు కోరుతున్నారు. ఈసీ ఉత్తర్వులతో భారీగా ఒకే పోలింగ్ కేంద్రాలలో అధిక ఓటర్లు ఉండే పరిస్థితి ఇక మీదట ఉండదని అంటున్నారు. దీని వల్ల ఓటర్లకు కూడా సమయం ఆదా అవుతుందని క్యూ లైన్లలో పడిగాపులు పడే శ్రమ ఎంతో కొంత తప్పుతుందని అంటున్నారు.
