ప్రజా తీర్పుకు ఏడాది : టీడీపీ వైసీపీ గ్రాఫ్ ఎంత ?
ఏపీలో ప్రజా తీర్పునకు ఏడాది కాలం గడచింది 2024 ఎన్నికల్లో ఏపీలో దాదాపుగా నాలుగుంపావు కోట్ల మంది ఓటర్లు తమ విలక్షణమైన తీర్పును అందించారు.
By: Tupaki Desk | 4 Jun 2025 8:56 AMఏపీలో ప్రజా తీర్పునకు ఏడాది కాలం గడచింది 2024 ఎన్నికల్లో ఏపీలో దాదాపుగా నాలుగుంపావు కోట్ల మంది ఓటర్లు తమ విలక్షణమైన తీర్పును అందించారు. ఏకంగా చరిత్రలో కన్వీ వినీ ఎరుగని తీరులో టీడీపీ కూటమికి 164 సీట్లు అందించారు. అప్పటిదాకా 151 సీట్లతో అధికారాన్ని చలాయించిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.
మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడానికి కారణం ఏమిటి అలాగే వైసీపీ వైఫల్యాలు వెనక ఉన్నది ఏమిటి అన్న చర్చ గత ఏడాదిగా సాగుతూనే ఉంది. ఏపీలో 2019 ఎన్నికల్లో పేదలు దిగువ మధ్య తరగతి వర్గాలతో పాటు ప్రాంతాలకు కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీకి అధికారం అందించారు. అయితే వైసీపీ తన పాలనలో కేవలం సంక్షేమానికి కట్టుబడిపోవడంతో పాటు అభివృద్ధిని పక్కన పెట్టడంతో జనాలకు చిర్రెత్తుకుని వచ్చింది.
మరో వైపు చూస్తే రాజకీయ కక్ష సాధింపులు కూడా పెద్దవి అయ్యాయి. ఆంధ్రుల సెంటిమెంట్ అయిన రాజధాని కలను నెరవేర్చకపోవడంతో పాటు మూడు రాజధానులు అని కొత్త నినాదం ఎత్తుకోవడం సైతం కారణం అయింది. ఇక ఉగ్యోగులు జై కొట్టినా సీపీఎస్ రద్దు కాకపోవడంతో వారంతా వైసీపీ మీద నిరసన వ్యక్తం చేశారు సచివాలయాలలో లక్షా పాతిక వేల ఉద్యోగాలు తీసినా యువత కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదన్న అసంతృప్తి వారికి ఏర్పడింది.
వైసీపీ నేతలలో కొందరి భాష బాగా లేకపోవడంతో పట్టణ ప్రజలు వ్యతిరేకం అయ్యారు. అభివృద్ధి సైతం లేకపోవడం కూడా వారిని దూరం చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ ని విశాఖలో నిర్బంధించడం వంటివి మైనస్ అయ్యాయి. మొత్తానికి వైసీపీ ఘోర ఓటమికి ఎన్నో కారణాలుగా నిలిచాయి.
మరి ఏడాది కాలం గిర్రున తిరిగింది. వైసీపీ తాను పోగొట్టుకున్న వర్గాలను ఎంత వరకూ దగ్గర చేసుకుంది అన్నదే ఇక్కడ ప్రధాన పాయింట్. అయితే వైసీపీకి దిగువ మధ్యతరగతి పేద వర్గాలలో మళ్ళీ అనుకూలత కనిపిస్తోంది. దానికి కారణం వారు 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మారి కూటమికి ఓటు వేయలేదు. ఎక్కువ సొమ్ములు పధకాల రూపంలో ఇస్తామన్న మాటకే కూటమికి వేశారు. దాంతో ఏడాదిగా పధకాలు పెద్దగా అమలు కాకపోవడంతో వారు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు.
ఇక ఎగువ మధ్య తరగతి ఉన్నత వర్గాలు ఈ రోజుకీ వైసీపీ వైపు చూడటం లేదు. దానికి కారణం కూటమి పాలనలో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, అమరావతి రాజధాని నిర్మాణానికి బాటలు వేయడం, అలాగే పోలవరానికి నిధులు కేంద్రం నుంచి రాబట్టడం, ఏపీకి పెట్టుబడులు తెచ్చే పనిలో కూటమి చిత్తశుద్ధిని చాటుకోవడం. ఇత్యాది అంశాల మూలంగా కూటమినే వారు సమర్ధిస్తున్నారు.
అంతే కాదు ఉచిత పధకాల పట్ల వారు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే దిగువ మధ్యతరగతి పేద వర్గాలలో మాత్రం కూటమి తీరు పట్ల అసంతృప్తి అయితే మొదలైంది. అది ఏ మేరకు పెరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక చూస్తే కనుక పట్టణ ఓటర్లు అంతా కూటమికి జై కొడుతున్నారనే చెప్పాలి. అక్కడ వైసీపీ తన గ్రాఫ్ ని పెంచుకోలేకపోయింది.
వారిని ఒప్పించే మెప్పించే విధంగా తన అభివృద్ధి అజెండాను ఈ రోజుకీ ముందుంచలేకపోయింది అనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో చూస్తే మార్పు కొంత మేర కనిపిస్తోంది. వైసీపీకి ఇక్కడే అనుకూలత ఉంది. అయితే అదే సమయంలో పల్లె పండుగ పేరుగో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల కూటమికి కూడా గతం కంటే ఇపుడు మద్దతు పెరిగింది. గతంలో సాలీడ్ గా వైసీపీకి మద్దతుగా నిలిచిన వారు ఇపుడు కూటమికి కూడా కొంత మొగ్గు చూపిస్తున్నారు.
ఇక మహిళల విషయానికి వస్తే రూరల్ మహిళలలో పెద్దలు వృద్ధులు వైసీపీకి కొంత అనుకూలంగా ఉంటే మధ్య వయసు వారు యువత మాత్రం కూటమి వైపు ఉన్నారు. ఎందుకంటే వారిలో కూటమి ఇచ్చిన హామీల ఆశలు ఇంకా అలాగే ఉన్నాయని అంటున్నారు.
ఇక సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే వైసీపీ 2024 ఎన్నికల్లో తాను కోల్పోయిన వర్గాలను దరి చేర్చుకునే ప్రయత్నం ఇంకా గట్టిగా మొదలెట్టలేదు. దాంతో కాపులు కూటమి వైపే ఉన్నారు కానీ ముందు ముందు ఏ మార్పు వస్తుందో చూడాలి. కమ్మలు ఎటూ టీడీపీకి సాలిడ్ గా సపోర్ట్ చేస్తారు. రెడ్లు 2024 ఎన్నికల తరువాత వైసీపీ మీద కోపం తగ్గించుకున్నారు.
తమకంటూ ఒక పార్టీ ఒక నాయకుడు ఉండాలన్న ఆలోచన వల్లనే అలా రీపోలరైజ్ అవుతున్నారని అంటున్నారు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సామాజిక వర్గాలలో అత్యధిక మద్దతు కూటమికే ఈ రోజుకీ ఉంది అని అంటున్నారు. ఇక ఏడాది కాలంగా చూస్తే వైసీపీ అధినేత జగన్ జనంలోకి రాలేదు. చంద్రబాబు అయితే ఎన్నో సార్లు జనం మధ్యకు వచ్చారు. దాంతో అయిదేళ్ల జగన్ ముఖ్యమంత్రిత్వం ప్రస్తుతం చంద్రబాబు సీఎం పాలనను బేరీజు వేసుకుంటున్న వారు బాబు అనుభవానికి ఆయన పెద్దరికానికి ఆయన కలుపుగోలు తనానికి మార్కులు వేస్తున్నారు.
ఇక వైసీపీకి ఈ ఏడాదిలో గ్రాఫ్ అయితే పెద్దగా పెరగలేదు అనే అంటున్నారు. కూటమికి బలం ఏమిటి అంటే జనసేన మద్దతు కేంద్రంలోని నరేంద్ర మోడీ సహకారంగా ఉన్నాయి. దాంతో ఏపీలో కులాల సమీకరణ తటస్థ ఉన్నత వర్గాల ఓట్లు కూటమికే ఈ రోజుకీ అనుకూలంగా ఉన్నాయి. పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు పధకాలను కనుక అమలు చేయగలిగితే కూటమికి రాజకీయంగా పెద్దగా సవాళ్ళు ఉండవనే చర్చ సాగుతోంది.