Begin typing your search above and press return to search.

కూట‌మిలో నామినేటెడ్ నేత‌లు.. ఏం చేస్తున్నారు.. ?

ఇక‌, దుర్గ‌గుడి, శ్రీకాళ‌హ‌స్తి, కాణిపాకం దేవాల‌యాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కూడా ఇలానే ఉంది. అధికారుల‌కు-నామినేటెడ్ స‌భ్యుల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి.

By:  Garuda Media   |   7 March 2026 8:30 AM IST
కూట‌మిలో నామినేటెడ్ నేత‌లు.. ఏం చేస్తున్నారు.. ?
X

రాష్ట్రంలో సుమారు 1200ల‌కు పైగా నామినేటెడ్ పోస్టుల‌ను చంద్ర‌బాబు భ‌ర్తీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ కోసం ప‌నిచేశార‌న్న వాద‌న ఉన్న నేప‌థ్యంలో వీరికి అవ‌కాశం క‌ల్పించారు. ఇంకా, చాలా మంది నామినే టెడ్ కోటా కోసంఎదురు చూస్తున్నారు. మ‌రో 2 వేల మంది నాయ‌కులు ఉన్నార‌న్న‌ది ప్ర‌స్తుతం పార్టీ వ‌ద్ద ఉన్న జాబితాను బ‌ట్టి నాయ‌కులు చెబుతున్నారు. వీరంతా పార్టీ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ త్యాగం చేసిన మాజీ మంత్రులు, సినియ‌ర్ నాయ‌కులు కూడా ఉన్నారు.

ఇదిలావుంటే.. అస‌లు ఇప్ప‌టికే భ‌ర్తీ అయిన 12 వంద‌ల పైచిలుకు పోస్టులకు సంబంధించి త‌ర‌చుగా పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఆ నాయ‌కులు ఏం చేస్తున్నారు? పార్టీ త‌ర‌ఫున , ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏమేర‌కు వాయిస్ వినిపిస్తున్నార‌న్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనిపైనే ఫోక‌స్‌కూడా పెట్టారు. రేపో మాపో ఐవీఆర్ ఎస్ స‌ర్వే ద్వారా.. నామినెట‌డ్ ప‌ద‌వులు పొందిన వారి ప‌నితీరును అంచ‌నా వేయాల‌ని కూడా.. సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ కార్యాల‌యం తెలిపింది.

ఇక‌, నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కించుకున్న‌వారిలో మ‌రో అసంతృప్తి కొన‌సాగుతోంది. త‌మ‌కు ప‌ద‌వులు ఇచ్చారే కానీ.. అధికారాలు లేవ‌ని వారు వాపోతున్నారు. తాము కూర్చునేందుకు కార్యాల‌యాలు లేవ‌ని.. వైసీపీ హ‌యాంలో ఎలా ఉందో ... ఇప్పుడు కూడా అలానే ఉంద‌ని వారు చెబుతున్నారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ ఎంపీకి.. కీల‌క ప‌ద‌విని అప్ప‌గించారు. కానీ, ఆయ‌న‌కు.. ఆ శాఖ‌లోని ఉన్న‌తాధికారికి మ‌ధ్య కీచులాట జ‌రుగుతోంది. త‌ను తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న అమ‌లు చేయ‌డం లేద‌ని నేత‌శ్రీ చెబుతున్నారు.

ఇక‌, దుర్గ‌గుడి, శ్రీకాళ‌హ‌స్తి, కాణిపాకం దేవాల‌యాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కూడా ఇలానే ఉంది. అధికారుల‌కు-నామినేటెడ్ స‌భ్యుల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు తిరుమ‌ల బోర్డు వ్య‌వ‌హారం కూడా వివాదంలోనే న‌డుస్తోంది. కానీ, ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ప‌ద‌వులు పొందిన వారికి చంద్ర‌బాబు నుంచి అభ‌యం ఉన్న నేప‌థ్యంలో వారు త‌మ ప‌నిని కొన‌సాగించాల‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ, మెజారిటీ నామినేటెడ్ ప‌దవుల్లో ఉన్న నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని ప్రారంభించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై సీఎం స్థాయిలో నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు.