Begin typing your search above and press return to search.

ఏపీలో వచ్చేనెల నుంచి కొత్త బార్ పాలసీ.. ఎన్నో మార్పులు చేసిన సర్కారు

ప్రస్తుతం 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. కొద్ది రోజుల్లో గీత కులాలకు రిజర్వు చేసిన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

By:  Tupaki Desk   |   14 Aug 2025 4:22 PM IST
ఏపీలో వచ్చేనెల నుంచి కొత్త బార్ పాలసీ.. ఎన్నో మార్పులు చేసిన సర్కారు
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న బార్ పాలసీలో చాలా మార్పులు చేసిన ప్రభుత్వం.. మూడేళ్ల కాలానికి కొత్త పాలసీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఎక్సైజ్ పాలసీ, రూల్స్ పై రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. గత పాలసీలో వేలం విధానంలో బార్లు కేటాయించగా, తాజాగా మార్చిన పాలసీలో లాటరీ విధానం తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. అదేవిధంగా పది శాతం అంటే 84 షాపులను గీత కులాలకు రిజర్వు చేశారు.

రాత్రి 12 గంటల వరకు ఓపెన్

కొత్త పాలసీ ప్రకారం బార్ల పనివేళలను ప్రభుత్వం సడలించింది. ప్రస్తుతం 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. కొద్ది రోజుల్లో గీత కులాలకు రిజర్వు చేసిన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సవరించిన పనివేళల ప్రకారం ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటలు వరకు బార్లు తెరిచి ఉంచవచ్చు. ప్రస్తుతం బార్ల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు జరుపుతున్నాయి. మార్పు చేసిన సమయాల వల్ల అదనంగా రెండు గంటలు అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

దరఖాస్తుకు రూ.5 లక్షల ఫీజు

లాటరీ విధానంలో బార్లను కేటాయిస్తున్నందున, వ్యాపారులు సిండికేట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తామన్న నిబంధన తీసుకువచ్చింది. అదేవిధంగా దరఖాస్తుకు రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు నిర్ణయించింది. అదనంగా మరో రూ.10 వేలు చెల్లించాల్సివుంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్ ఫీజును మూడు కేటగిరీల్లో నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, పర్యాటకశాఖ గుర్తించిన పర్యాటక కేంద్రాల్లో మాత్రమే లైసెన్సీలు బార్లు ఏర్పాటు చేయాల్సివుంటుంది.

లైసెన్సు ఫీజులు

50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో రూ.55 లక్షలు, 5 లక్షల జనాభా దాటిన నగరాల్లో రూ. 75 లక్షలు ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. కాగా, గీత కార్మికులకు కేటాయించే బార్లకు 50 శాతం లైసెన్సు ఫీజు ఉంటుందని తెలిపింది. ఈ ఫీజు ఏటా పది శాతం చొప్పున పెరుగుతుంది. ఇక బార్లలో రూ.99 మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. అదేవిధంగా విమానాశ్రయాల్లో బార్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. తిరుపతి విమానాశ్రయంలో మాత్రం బార్ ఏర్పాటుకు అనుమతి లేదని తెలిపింది. బార్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు స్వయంగా లేదా ఆన్ లైన్ ద్వారా తమ దరఖాస్తులను దాఖలు చేయొచ్చని ప్రభుత్వం వెల్లడించింది.