'స్మార్ట్' చిట్కా!.. అదిరిపోయే ఎండలకు విరుగుడు
వేసవి ఎండలు మండిపోతున్నాయి. సాధారణంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక అర్బన్ హీట్ ఐలాండ్ తో నగరాలు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి.
By: Tupaki Desk | 19 April 2026 5:00 AM ISTవేసవి ఎండలు మండిపోతున్నాయి. సాధారణంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక అర్బన్ హీట్ ఐలాండ్ తో నగరాలు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి. ఎండలకు తోడుగా కాలుష్యం, కాంక్రీట్ జంగిల్స్ విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలతో నగరాల్లో రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితులు అధిగమించి ప్రజలు సాధారణ జీవనం సాగించడానికి ఏపీ ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన చేసింది. ఈ వేసవి ఆరంభం నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మిస్ట్ స్ప్రేయింగ్ మెషీన్లతో వాతావరణాన్ని చల్లబరిచే ప్రయోగం చేస్తున్నాయి.
గత నెల రోజులుగా విజయవాడ, విశాఖపట్నంలో ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులలో మిస్ట్ స్ప్రేయింగ్ మెషీన్లు దర్శనమిస్తున్నాయి. వీటి ద్వారా నగరాల్లోని బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు మరియు రద్దీగా ఉండే వీధుల్లో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ యంత్రాలను వాడుతున్నారు. ఇవి నీటిని చాలా సూక్ష్మమైన తుంపర్ల రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ తుంపర్లు గాలిలోని వేడిని గ్రహించి ఆవిరైపోవడం ద్వారా చుట్టుపక్కల వాతావరణాన్ని తక్షణమే చల్లబరుస్తాయి. దీనివల్ల బాటసారులకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఎండ వేడి మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న ఈ స్మార్ట్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా ‘ఆంధ్రా ఓవెన్’గా చెప్పే విజయవాడలో బాటసారులు కొత్త అనుభూతిని పొందుతున్నారని అంటున్నారు. విజయవాడలో వేసవి ఉష్ణోగ్రతలు సుమారు 44 డిగ్రీల సెల్సియస్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మరో నాలుగు లేదా ఐదు డిగ్రీలు పెరుగుతుంటాయని నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో విజయవాడలో ఎండ తీవ్రత తగ్గించడానికి ప్రభుత్వం మిస్ట్ స్ప్రేయింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువచ్చిందని చెబుతున్నారు.
మిస్ట్ స్ప్రేయింగ్ మెషీన్లు వెదజల్లే నీళ్లు రోడ్ల చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. వీటివల్ల రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలు కూడా ఎండిపోకుండా పచ్చదనం పెరుగుతుందని అంటున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ వల్ల కాలుష్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానం సత్ఫలితాలను ఇస్తే భవిష్యత్తులో తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉష్ణోగ్రతలను నిలువరించేందుకు కేంద్రీకృత వ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
