కొత్త ఫార్ములాతో డీలిమిటేషన్...తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ?
వచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల తోనే ముందుకు సాగాలని కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది.
By: Satya P | 13 Jun 2026 9:36 AM ISTవచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల తోనే ముందుకు సాగాలని కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. దాని కోసం మరోసారి ప్రయత్నం చేస్తోంది. ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి మరీ డీలిమిటేషన్ బిల్లుని నెగ్గించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతే కాదు ఏకంగా 54 ఓట్ల తేడాతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు అయితే వీగిపోయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా బీజేపీ మరో ప్రయత్నం చేస్తోంది అని ప్రచారం హస్తిన వర్గాలలో జోరుగా సాగుతోంది.
తాజా ప్రతిపాదనతో :
ఇదిలా ఉంటే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తాజాగా మరో ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి చేసినట్లుగా తెలుస్తోంది. దీని వివరాలు ప్రచారం కావడంతో మీద దేశ వ్యాప్తంగా కొత్త మొదలైంది. ఈ తాజా ప్రతిపాదనలు చూస్తే కనుక లోక్ సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 824కి పెంచాలని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి సూచించినట్లుగా చెబుతున్నారు. అంటే గుత్తమొత్తంగా ప్రతీ రాష్ట్రంలో మొత్తం ఉన్న సీట్లలో మరో యాభై శాతం పెంచే బదులుగా మరో కొత్త ఫార్ములాతో ఈ మండలి ప్రతిపాదనలు ఉండడం ఆసక్తిని పెంచుతోంది.
మూడవ వంతు మాత్రమే :
ఇక ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం మూడవ వంతు పార్లమెంట్ సీట్లను మాత్రమే పెంచాలని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.అంటే 170 పార్లమెంట్ నియోజకవర్గాలలోనే పునర్ విభజన ఉంటుంది అన్న మాట. మరి ఈ లెక్క ఏమిటి అంటే ఈ సీట్లలోనే అధిక జనాభా ఉంది. అంతే కాదు ఇవి పెద్ద నియోజకవర్గాలుగా కూడా ఉన్నాయని మండలి గుర్తించింది అని చెబుతున్నారు. ఇక ఇందులో కూడా ఒక 59 పార్లమెంట్ నియోజకవర్గాలను రెండుగా విభజించాలని మరో 111 సీట్లను మూడుగా చేయాలని కూడా మండలి సూచించింది అని అంటున్నారు.
వీటిని పరిగణనలోకి :
ఇక ఈ నియోజకవర్గాల పునర్విభజనను చేసేటపుడు గత ఎన్నికలలో అక్కడ నమోదు అయిన ఓటింగ్ శాతం, అలాగే అక్కడ షెడ్యూల్డ్ కులాలు యు షెడ్యూల్డ్ తెగల జనాభా, మహిళా జనాభా వంటి ఇతర కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి సూచించినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ కొత్త ఫార్ములా ప్రకారం ఏపీలో మొత్తం ఉన్న 25 ఎంపీ సీట్లలో విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గాలను ఒక్కొక్క దానినీ మూడు నియోజకవర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లుగా చెబుతున్నారు. అలాగే మచిలీపట్నాన్ని రెండుగా విభజించాలని కూడా మండలి ప్రతిపాదించింది అంటున్నారు.
తెలంగాణాలో సైతం :
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించాలని చూస్తున్నారు. అదే విధంగా చెవెళ్ళను రెండు నియోజకవర్గాలుగా విభజించాలని ప్రతిపాదించారు. ఇలా కొత్త ఫార్ములా ప్రకారం 170 లోక్ సభ సీట్లలోనే విభజన జరిగి సీట్లు అదనంగా పెరిగింతే కనుక జాతీయ స్థాయిలో ఓటింగ్ శాతం 2.32 కి కొత్తగా పెరుగుతుందని అంటున్నారు. అలాగే అదనంగా 22.3 మిలియన్ల ఓట్లు కూడా లభించే అవకాశం ఉందని లెక్క వేస్తున్నారు. ఇక ఏపీలో ఓటింగ్ శాతం 3.52 శాతానికి తెలంగాణలో 6.55 శాతానికి పెరగవచ్చని కూడా చెబుతున్నారు.
ఏపీలో ఎన్ని సీట్లు :
ఇక ఈ ఫార్ములా ప్రకారం కనుక సీట్లు పెరిగితే ఏపీలో ప్రస్తుతం ఉనన్ లోక్‌సభ స్థానాలు 25 నుండి 38 కి చేరుకుంటాయని అంటున్నారు. అలాగే తెలంగాణలో 17 నుండి 26 పెరుగుదల ఉంటుందని, కర్ణాటకలో 28 నుండి 42కి, తమిళనాడులో 39 నుండి 59కి కేరళలో 20 నుండి 30కి ఎంపీ సీట్లు పెరుగుతాయని అంటున్నారు దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని కూడా అంటున్నారు. దీంతో ఈ ఫార్ములాతో కనుక కొత్తగా డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
