Begin typing your search above and press return to search.

స‌మ‌న్వ‌య క‌మిటీలతో కూట‌మి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయా.. ?

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కూట‌మి ప్ర‌భుత్వం.. భారీ ఎత్తున క‌స‌రత్తు ప్రారంభించింది.

By:  Garuda Media   |   18 July 2026 12:00 AM IST
స‌మ‌న్వ‌య క‌మిటీలతో కూట‌మి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయా.. ?
X

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కూట‌మి ప్ర‌భుత్వం.. భారీ ఎత్తున క‌స‌రత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగానే సమ‌న్వ‌య క‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు రంగం రెడీ చేస్తున్నారు. ఈ నెల 18న స‌మ‌న్వ‌య క‌మిటీల‌కు తుది రూపం తీసుకురానున్నారు. అయితే.. ఈ క‌మిటీలు.. ఉన్న స‌మ‌స్య‌లు త‌గ్గించాల్సి ఉంటుంది. కానీ, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌లు.. స‌మ‌న్వ‌య క‌మిటీల‌పై వేస్తున్న అడుగుల‌ను ప‌రిశీలిస్తే.. దీనికి భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

పార్ల‌మెంటు, అసెంబ్లీల వారీగా మూడు పార్టీలు(టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) ఉమ్మ‌డిగా స‌మ‌న్వ‌య క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అంటే.. 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల్లో క‌మిటీలు ఏర్ప‌డ‌నున్నాయి. ప్ర‌స్తుతం నిర్ణ‌యం తీసుకున్న మేర‌కు.. ఆయా క‌మిటీల్లో సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీల‌ను కీలక భూమిక పోషించేలా తీసుకుంటారు. అనంత‌రం.. జిల్లాల ఇంచార్జులు, నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు చూసే వారిని క‌మిటీల‌లో నియ‌మించ‌నున్నారు. ఇదే ఇప్పుడుఅస‌లు చిక్కుగా మారుతోంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం స‌మ‌న్వ‌యం కొర‌వ‌డడానికి కార‌ణం.. ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణేన‌ని తెలిసిందే. అయితే.. దీనిని ఏ పార్టీ కూడా స‌ర్దుబాటు చేయ‌డం లేదు. పైకి అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాల‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం విభేదాల‌ను పరిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయ‌డం లేదు. ఇది ప్ర‌ధానంగా పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి ఇబ్బందిక‌రంగా మారింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ నేత‌ల‌నే స‌మ‌న్వ‌య క‌మిటీల్లో కీల‌క పాత్ర ధారులుగా తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌.

పైగా స్థానికంగా జ‌రిగే ఎన్నిక‌లు కావ‌డంతో స్థానిక నేత‌ల‌కు ఎక్కువ‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. అయితే.. ఈ వాద‌న‌ను పార్టీలు వినిపించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల‌కే ఎక్కువ‌గా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ.. తాజాగా జ‌రిగిన కీల‌క స‌మావేశంలో మూడు పార్టీల నాయ‌కులు నిర్ణ‌యించారు. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ముఖ్యంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య ఉన్న వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌కుండా చేస్తున్న ఈ ప్ర‌యోగం పెద్ద‌గా ఫ‌లించేలా క‌నిపించ‌డం లేద‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు.