ఎవరు ఎక్కడ పోటీ.. డిసైడ్ చేసిన చంద్రబాబు
కూటమి రాజకీయాలలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మరో రోజులు ప్రారంభం అవుతోంది.
By: Tupaki Desk | 15 Oct 2026 6:30 PM ISTకూటమి రాజకీయాలలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మరో రోజులు ప్రారంభం అవుతోంది. అయినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కిరాలేదు. కూటమిగా పోటీ చేయడంపై మూడు పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నదే సస్పెన్స్ గా ఉంది. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో మూడు పార్టీల్లోనూ గందరగోళమే రాజ్యమేలుతోంది. ప్రధానంగా ఈ విషయంలో బుధవారం వరకు జనసేన పార్టీ కాస్త పెత్తనం చేయగా, ఇప్పుడు పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. తమకు 40 శాతం వాటా సీట్లు కావాలంటూ బహిరంగ ప్రకటన చేసిన జనసేన ఇప్పుడు అలాంటి సౌండ్ వినిపించడం లేదు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెబుతారు? ఆయన నిర్ణయం ఏంటో తెలుసుకునేందుకు ఎదురు చూస్తోందని అంటున్నారు.
కూటమి పార్టీల మధ్య సర్దుబాటు విషయంలో సమన్వయ కమిటీ సభ్యులు ఏకాభిప్రాయం సాధించలేకపోవడంతో మొత్తం వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని అంటున్నారు. కూటమిలో ఎవరు ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేద్దామని తేల్చిచెప్పిన చంద్రబాబు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలను ఏయే స్థానాల్లో పోటీకి పెడతామనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కలిసి తమ పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయమై క్లారిటీ తీసుకోవాలని జనసేన, బీజేపీ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగమేని రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నానేది బహిరంగంగా ప్రకటించలేదు. ఈ రోజు రాత్రికి తుది నిర్ణయం తీసుకుని బహిరంగంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. నిన్నటి వరకు తాము అన్నిస్థానాల్లో పోటీ చేస్తాం.. ఇన్ని పదవులు కావాలంటూ పట్టుబట్టిన మిత్రపక్షాలు ఈ రోజు మాత్రం అటువంటి ప్రకటనల జోలికి వెళ్లకపోవడం, అటువైపు నుంచి లీకుల ద్వారా టీడీపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు కూడా లేకపోవడంతో సర్దుబాటుపై ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మూడు పార్టీల తరఫున మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా బలమైన నేతలను ఎంపిక చేసిన తర్వాతే ప్రకటన విడుదల చేయాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.
మేయర్, మున్సిపల్ సీట్లు పార్టీల పరంగా కాకుండా రాజకీయంగా ఆర్థికంగా బలమైన నాయకులను ముందుగా ఎంపిక చేసి వారి గెలుపు అవకాశాలపై ఒక అంచనాకు వచ్చిన తర్వాతే ఏ పార్టీ తరఫున పోటీ పెట్టాలనే నిర్ణయానికి రావాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో అవసరమైతే మూడు పార్టీల మధ్య నాయకులను సర్దుబాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని నేతలు తీర్మానించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయవాడలో మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారినట్లు మరికొందరు కూడా టీడీపీ లేదా జనసేన, బీజేపీ నుంచి అటు ఇటు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి అభ్యర్థుల ఎంపిక పూర్తయిన వరకు ఎవరు ఎక్కడ నుంచి అన్న టాపిక్ పై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
