Begin typing your search above and press return to search.

జగన్ అరెస్టు కావడమే షర్మిల లక్ష్యమా..? చంద్రబాబును రెచ్చగొడుతున్నారా?

లిక్కర్ స్కాంపై తొలిసారి స్పందించిన షర్మిల గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   24 July 2025 7:28 PM IST
జగన్ అరెస్టు కావడమే షర్మిల లక్ష్యమా..? చంద్రబాబును రెచ్చగొడుతున్నారా?
X

ఏపీ లిక్కర్ స్కాంపై పీసీసీ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పలు విషయాలపై స్పందిస్తున్న షర్మిల.. లిక్కర్ స్కాంపై ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు ముఖ్యమంత్రి చంద్రబాబును రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం స్కాం కేవలం రూ.3,500 కోట్లకే పరిమితం కాదన్న షర్మిల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన రూ.లక్ష కోట్ల విక్రయాలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిని మరింత ఇబ్బంది పెట్టేలా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

లిక్కర్ స్కాంపై తొలిసారి స్పందించిన షర్మిల గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కాంపై మీడియాతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షురాలు ప్రస్తుతం జరుగుతున్న విచారణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కాంపై సిట్ దర్యాప్తు కొన్ని అంశాలకే పరిమితమైందని షర్మిల ఆరోపించారు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుందని అభివర్ణించారు. సిట్ దర్యాప్తు అంతా డిస్టలరీల చుట్టూనే సాగుతోందన్న షర్మిల కమీషన్లు, బెదిరింపులు, కిక్ బ్యాగ్స్ మాత్రమే కాదని డిస్టలరీల నుంచి వినియోగదారు వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణమే అన్నారు. మద్యం స్కాంలో కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే అవినీతి జరగలేదని, దాదాపు లక్ష కోట్లు వరకు చేతులు మారినట్లు తనకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు షర్మిల.

ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి ఏపీ లిక్కర్ స్కాంలో చోటుచేసుకుందని షర్మిల ఆరోపించారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం విక్రయించడం కేవలం మన రాష్ట్రంలోనే అమలు చేశారని దుయ్యబట్టారు. ఇది చాలా తీవ్ర ఆర్థిక నేరంగా చెప్పిన షర్మిల అనధికార అమ్మకాల కోసమే డిజిటల్ పేమెంట్లు అనుమతించలేదని ఆరోపించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను భారీగా విక్రయించారని, అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారని విమర్శించారు. లిక్కర్ స్కాంపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారని, లక్ష కోట్ల మద్యం అమ్మితే కేవలం రూ.600 కోట్లు డిజిటల్ పేమెంట్లు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన రూ.99 వేల కోట్లు ఏమయ్యాయో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంలో ట్రస్టెడ్ లిక్కర్ అమ్మలేదని, హానికరమైన మద్యాన్ని విక్రయించారని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. హానికరమైన మద్యాన్ని తయారుచేసే కంపెనీలకే అనుమతులిచ్చారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి కిడ్ని, లివర్ సమస్యలు వచ్చాయని కూటమి ప్రభుత్వం చెప్పిందని, హానికరమైన మద్యాన్ని తాగి 30 వేల మంది వరకు మరణించారని, లక్షల మందికి నరాల బలహీనత సమస్యలు వచ్చాయని మీరు నియమించిన కమిటీలు రిపోర్టు ఇచ్చాయని గుర్తు చేశారు. ఈ అంశంపై కూడా దర్యాప్తు జరగాలన్నారు. క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మకాలు జరపారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఈ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్టు చేస్తారా? లేదా? అన్నది చూడాల్సివుందని షర్మిల వ్యాఖ్యానించారు. విచారణను బట్టి ఏం నిర్ణయం తీసుకుంటారో తాము చూస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకి బి.టీమ్ అవ్వాల్సిన అవసరం లేదన్న షర్మిల తన సోదరుడు జగన్మోహనరెడ్డి మాత్రం బీజేపీకి బీ.టీమ్ గా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, వైసీపీ ఎంపీలు ఈ నాటికి మోడికి మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ ముగ్గురూ బీజేపీకి తొత్తులు అంటూ షర్మిల ఆరోపించారు.