Begin typing your search above and press return to search.

డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు.. మండలిలో మంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా విపక్షం వైసీపీ బలమైన వాదనలు వినిపిస్తుండటంతో మండలి చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 Feb 2026 10:00 PM IST
డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు.. మండలిలో మంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా విపక్షం వైసీపీ బలమైన వాదనలు వినిపిస్తుండటంతో మండలి చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మంగళవారం శాసనసభలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై చర్చ జరగితే, మండలిలో శాంతిభద్రతలతోపాటు అనేక అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చలు సాగాయి. ఇటీవల మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యాచారం ఘటనను విపక్షం మండలిలో చర్చించగా, అధికార పక్షం ఘాటు రిప్లై ఇచ్చింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయని చెబుతున్నారు.

రాష్ట్రంలో గంజాయి నియంత్రణ, నేరస్తులపై చర్యలు వంటి వాటిపై మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఏ ఒక్కరిని వదిలేది లేదంటూ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సమయంలో ‘‘శవాన్ని డోర్ డెలవరీ చేసిన వాళ్ల కుటుంబ సభ్యులను కూడా వెతుకుతున్నాం.’’ అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. దీంతో విపక్షానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అరెస్టుపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న సంకేతాలు పంపినట్లు అయిందని అంటున్నారు. 2022లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబు ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో కొద్ది రోజుల క్రితం సప్లిమెంట్ చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గను ఏ2గా పేర్కొన్నారు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం ఆమె ప్రయత్నిస్తుండగా, అరెస్టు చేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని హోంమంత్రి అనిత వ్యాఖ్యలతో వెల్లడైందని అంటున్నారు. తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన భార్య ప్రమేయం లేకపోయినా ఆమె పేరు చార్జిషీటులో చేర్చారని ఎమ్మెల్సీ అనంత బాబు ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.

ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మండలిలో మాట్లాడుతుండగా, వైసీపీ సభ్యులు నేరస్తులను వదిలేస్తున్నారని ఆరోపిస్తుండగా, అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. తమ ప్రభుత్వంలో క్రైం రేటు తగ్గిందని, నేరాలకు పాల్పడుతున్న వారు ప్రభుత్వ చర్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నేరస్తులు, నిందితులను ఎవరినీ విడిచి పెట్టే ప్రసక్తి లేదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పేరు ప్రస్తావించకుండానే ఆయన భార్య అరెస్టుకు కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని హోంమంత్రి అనిత ఇచ్చారని అంటున్నారు.