Begin typing your search above and press return to search.

ఎవరా ఐఏఎస్ అధికారి? హైదరాబాద్ పోలీసుల్లో హాట్ టాపిక్

ప్రధాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఒక వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

By:  Garuda Media   |   6 Sept 2025 2:07 PM IST
ఎవరా ఐఏఎస్ అధికారి? హైదరాబాద్ పోలీసుల్లో హాట్ టాపిక్
X

ప్రధాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఒక వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. ఈ వార్తను మిగిలిన మీడియా సంస్థలు మిస్ అయ్యాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు తెలంగాణకు చెందిన పోలీసులు కిందా మీదా పడుతున్నారు. ఈ వార్తను పబ్లిష్ చేసిన మీడియా సంస్థ నుంచి వివరాలు సేకరించేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకూ అంత సంచలనంగా మారిన వార్తాంశం ఏమిటి? అందులో పేర్కొన్న అంశాల్ని.. చదివినంతనే ఉలిక్కిపడేలా చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు. ఇంతకూ సదరు వార్తా కథనంలో ఏమున్నదంటే..

ఏపీకి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఉదంతంగా దీన్ని చెబుతున్నారు. ఏపీలోని గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి మంచి పేరుంది.కొంతకాలంగా ఆయన తీరులో వచ్చిన మార్పుతో భారీగా కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. కొంతకాలం క్రితం హైదరాబాద్ కు చెందిన ఒక మహిళతో సదరు ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారని.. అయితే ఇటీవల ఆమెపై నెలకొన్న అనుమానం గొడవగా మారి.. ఈ క్రమంలో ఆమెను బలంగా కొట్టటం ద్వారా ఆమె మరణానికి కారణమైనట్లుగా పేర్కొంటున్నారు.

ఐదు పదుల వయసు దాటిన సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. హైదరాబాద్ లోని మరో మహిళతో సన్నిహితంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. కొద్దికాలంగా ఆయన ఆరోగ్యంలో తీవ్ర మార్పులు రావటం.. దీంతో చికిత్స వేళలో తన వద్ద ఉండకుండా సదరు మహిళ.. వేరే వారితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానం మొదలైంది. ఈ విషయంలో ఆమెతో తరచూ గొడవ పడేవాడని తెలుస్తోంది.

తాజాగా ఇదే విషయంపై సదరు మహిళతో గొడవ పడిన సీనియర్ ఐఏఎస్ అధికారి తీవ్ర ఆగ్రహంతో ఆమెపై చేయిచేసుకోవటంతో పాటు.. బలంగా నెట్టేయటంతో ఆమె తల గోడకు గుద్దుకోవటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెను ఒక ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించటంతో.. ఆమె కిందపడటం వల్ల గాయం తగిలి చనిపోయినట్లుగా రికార్డులు రాయించినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు సదరు బాధితురాలి కుటుంబానికి భారీగా ముట్టజెప్పి.. వివరాలు బయటకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్తా కథనం ప్రముఖంగా పబ్లిష్ కావటంతో.. ఇప్పుడు ఆ సీనియర్ ఐఏఎస్ ఎవరు? సదరు కార్పొరేట్ ఆసుపత్రి ఏది? అలా ఎలా అంత పెద్ద ఇష్యూను మేనేజ్ చేయగలిగారు? అన్న ప్రశ్నలతో పాటు.. ఈ చిక్కుముడులు విప్పేందుకు తెలంగాణ పోలీసులు కిందా మీదా పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.