వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి బెయిల్.. ఏం జరిగింది?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
By: Tupaki Desk | 5 May 2025 4:01 PMవైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. పోలీసులకు సహకరించాలని.. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పడు అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తేడా వస్తే.. పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. ముందస్తు బెయిల్ కోసం షరతులు విధించాలన్న పోలీసుల వాదనను హైకోర్టు పక్కన పెట్టింది. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్.. గత నెలలో అనంతపురం జిల్లాలో పర్యటించారు. వైసీపీ నాయకుడు ఒకరు హత్యకు గురైన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్.. ఉమ్మడి అనంత జిల్లాలోని చెన్నేకొత్తపల్లికి వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు.. పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. ఈ పర్యటన సందర్భంగా జగన్ బాగానే సాగినా.. అనంతరం.. కార్యకర్తలు ఆయనను చూసేందుకుఎగబడ్డారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద తీవ్ర రచ్చ చోటు చేసుకుంది. హెలికా ప్టర్ రెక్కలు వంచేయడం.. విండ్ షీల్డ్‌ను ధ్వంసం చేయడంతో జగన్.. తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరుకు వెళ్లిపోయారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు వచ్చింది. అప్పట్లో ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. జగన్‌కు భద్రత కల్పించడం లేదని, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో దీనిపై విచారణకు ఆదేశించింది. విచారణాధికారులు.. హెలికాప్టర్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు సహా.. పైలట్‌ను కూడా విచారించారు. ఇదేసమయంలో అప్పట్లో రచ్చ చేశారని భావిస్తున్నవారిపై స్థానిక కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 మందిపై కేసులు పెట్టారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్నారెడ్డి తదితరులు ఉన్నారు.
అయితే.. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన తోపుదుర్తి.. ఈ కేసు నమోదైన వెంటనే పరారయ్యారు. దీంతో రెండు ప్రత్యేక బృందాలు తోపుదుర్తి కోసం గాలిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరుల్లో మకాం వేసి మరీ తోపుదుర్తి కోసం వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు.. ఆదివారమే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సుమారు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ పరిణామాల క్రమంలోనే తోపుదుర్తి ముందస్తు బెయిల్ కోరుతూ.. రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. తాజాగా సోమవారం ఆయనకు బెయిల్ ఇస్తూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, పోలీసులు పిలిచినప్పుడు వెళ్లాలని షరతు విధించింది.