ప్రైవేట్ ఆలయాల మీద కూటమి సర్కార్ సంచలన నిర్ణయం
శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం కాశీబుగ్గలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఒక దేవాలయంలో కార్తీక ఏకాదశి వేళ జరిగిన దుర్ఘటనలో ఏకంగా తొమ్మిది మంది అమాయక భక్తులు మరణించారు.
By: Satya P | 2 Nov 2025 9:45 PM ISTఒక పెద్ద విషాదం జరిగింది. దానిని పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో వేల సంఖ్యలో ప్రైవేట్ ఆలయాలు ఉన్నాయి. వీటి అదుపూ అజమాయిషీ విషయంలో ఇప్పటిదాకా దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే పెద్దగా దృష్టి పెట్టింది లేదు. ఎందుకంటే అవి ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తూ పోతున్నాయి. దాంతో పాటు ప్రైవేట్ ఆలయాల నిర్వహణ వాటి భారాలు అన్నీ ఆయా నిర్వాహకులే చూసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక ఘోర కలి ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఆలోచనలను మార్చేలా చేసింది.
కాశీబుగ్గ దుర్ఘటన :
శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం కాశీబుగ్గలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఒక దేవాలయంలో కార్తీక ఏకాదశి వేళ జరిగిన దుర్ఘటనలో ఏకంగా తొమ్మిది మంది అమాయక భక్తులు మరణించారు. మహిళలు చిన్న పిల్లలు ఇందులో ఉండడంతో యావత్తు దేశం దృష్టినే ఈ దుర్ఘటన ఆకర్షించింది. అంతా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి తో పాటు తీవ్రమైన సంతాపం కూడా ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగానే కదిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు అంతా హుటాహుటిన ఘటనా స్థలిని చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు.
ఇరవై నాలుగు గంటలలోనే :
ఇక మంత్రి నారా లోకేష్ పలాస ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సాయానికి సంబంధించిన చెక్కులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా మృతుల కుటుంబాల ఇళ్ళకు వెళ్ళి మరీ వారికి అందచేశారు తొందరలోనే కేంద్రం ప్రకటించిన రెండు లక్షల సహాయం కూడా అందిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా చెప్పడం విశేషం. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆనం కీలక ప్రకటన :
ఇక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఆసుపత్రికి వెళ్ళి బాధితులను కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల మీద ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం ఇక మీదట పెడుతుందని అన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా చూస్తామని అన్నారు. భవిష్యత్తులో ఏ రకమైన దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు.
స్వాగతిస్తున్న ఆస్తిక జనం :
కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆలయాల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల ఆస్తిక జనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తితో వెళ్లే వారికి ఆయా ఆలయాలలో ఉండే పరిస్థితులు వాతావరణం అన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలీ అంటే తప్పనిసరిగా ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని అంటున్నారు. దీని మీదనే పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి ఆనం చెప్పడం పట్ల కూడా అంతా స్వాగతిస్తున్నారు. అమాయక భక్తులకు భద్రతతో పాటు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని అంతా అంటున్నారు. ఏది ఏమైనా కాశీబుగ్గ ఘటన అన్నది ఆలయాల్లో తొక్కిసలాటలకు చిట్ట చివరిది కావాలనే ఆస్తిక జనులు అంతా కోరుకుంటున్నారు.
