రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్, ఐపీఎస్ పీఎస్ఆర్ కు షాక్, కాంతిరాణా టాటాకు ఝలక్!
సీనియర్ ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటాకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By: Tupaki Political Desk | 9 March 2026 5:00 PM ISTసీనియర్ ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటాకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరి సస్పెన్షన్ ను మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీ కేడర్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ ఆయన రిటైర్మెంట్ వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేసమయంలో ఐజీ కేడర్ అధికారి కాంతిరాణా టాటా సస్పెన్షన్ ను సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. ఈ ఇద్దరి సస్పెన్షన్ పై గత నెల 26న రివ్యూ కమిటీ సమీక్షించింది. ఇద్దరూ సీనియర్ అధికారులు కావడం వల్ల సస్పెన్షన్ ఎత్తివేస్తే, వారిపై నమోదైన కేసులలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. ఈ కారణంగా ఇద్దరు అధికారుల సస్పెన్షన్ మరోసారి పొడిగించినట్లు చెబుతున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని అక్రమ అరెస్టు, వేధింపుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా పీఎస్ఆర్ పై గ్రూప్-1 వ్యాల్యుయేషన్ అక్రమాల కేసు అదనంగా నమోదైంది. ఆయా కేసుల్లో ఇద్దరి పాత్రను నిర్ధారిస్తూ శాఖాపరమైన నివేదికలు అందడంతో ప్రభుత్వం గతంలో సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా డీజీ కేడరులో ఉన్న పీఎస్ఆర్ ను అరెస్టు చేసి కొన్నాళ్లు రిమాండులో ఉంచారు. గత ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వివాదాస్పద వైఖరి అనుసరించడంతో ప్రస్తుత ప్రభుత్వం ఆగ్రహాంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ తర్వాత మళ్లీ యూనిఫాం వేసుకునే అవకాశం కల్పించకుండా సస్పెన్షన్ పొడిగించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి పీ.వీ.సునీల్ కుమార్ పైనా ఇదే తరహా సస్పెన్షన్ వేటు పడింది. సునీల్ కుమార్ రిటైర్మెంట్ వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పీఎస్ఆర్ విషయంలోనూ అలాంటి ఉత్తర్వులే వెలువడ్డాయి. ఈ ఇద్దరు అధికారులు కూడా డీజీ కేడర్ లో ఉన్నవారే కావడం గమనార్హం. క్రమశిక్షణ చర్యలకు గురికాకుంటే ఇద్దరూ డీజీపీలుగా పనిచేసే అవకాశాన్ని దక్కించుకునే వారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పీఎస్ఆర్ రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ కొనసాగించడం డిపార్టుమెంటులో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 31న ఆయన రిటైర్ కానున్నారు. ప్రభుత్వ చర్యతో ఆయన మళ్లీ విధుల్లో చేరే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. తాజాగా పొడిగించిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ముంబై నటి కాదంబరి జెత్వాని కేసుతోపాటు గ్రూప్-1 కేసు నుంచి విముక్తి కలిగే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయన రిటైర్మెంట్ లోపు ఈ రెండు కేసుల నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదని అంటున్నారు. దీంతో సీనియర్ పోలీసు అధికారిగా పీఎస్ఆర్ అత్యంత అవమానకరమైన రీతిలో రిటైర్ అయ్యే పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల వల్ల పీఎస్ఆర్ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ప్రయోజనాలు కూడా వెంటనే అందే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
