Begin typing your search above and press return to search.

ఎట్ హోం కి స్పెషల్ ఎట్రాక్షన్ గా బాబు !

ఎట్ హోం అన్నది ఒక సంప్రదాయంగా వస్తోంది. ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అలాగే గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్ లో ప్రభుత్వ ప్రతినిధులకు ప్రజా ప్రతినిధులకు వీఐపీలకు పిలిచి గౌరవార్ధం తేనీటి విందు ఇస్తారు.

By:  Satya P   |   15 Aug 2026 10:38 PM IST
ఎట్ హోం కి స్పెషల్ ఎట్రాక్షన్ గా బాబు !
X

ఎట్ హోం అన్నది ఒక సంప్రదాయంగా వస్తోంది. ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అలాగే గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్ లో ప్రభుత్వ ప్రతినిధులకు ప్రజా ప్రతినిధులకు వీఐపీలకు పిలిచి గౌరవార్ధం తేనీటి విందు ఇస్తారు. ఇది హై టీ ఈవెంట్ గా కూడా చూస్తారు. ఇది ఒక ముఖ్యమైన మరియు గౌరవప్రదమైన సంప్రదాయంగా ఉంటూ వస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఈ వేడుకను అధికారికంగా నిర్వహిస్తారు. అలా ఇందులో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మరియు ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా కలిసేందుకు ఇది వేదిక అవుతుంది.

ఏపీలో మాత్రం :

ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం ఎట్ హోం కి ఎపుడూ అధికార పక్షం సభ్యులే ఎక్కువగా హాజరవుతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అప్పట్లో కానీ ప్రస్తుతం కానీ వచ్చిన సందర్భాలు అయితే లేవు, 2014 నుంచి 2019 మధ్యలో హైదరాబాద్ రాజ్ భవన్ లో ఒకసారి ఎట్ హోం కి మాత్రం జగన్ హాజరయ్యారు. ఆ సమయంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు అలాగే తెలంగాణా సీఎం గా ఉన్న కేసీఆర్ కూడా వచ్చారు. అది తప్పించి జగన్ ఎట్ హోం కి వెళ్ళింది లేదని చెబుతారు. ఇక జనసేన అధినేత హోదాలో పవన్ ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో కూడా ఎట్ హోం కి హాజవుతూ వస్తున్నారు. అయితే ఫస్ట్ టైం ఆయన ఎట్ హోం కి రాలేకపోయారు. తనకు తీవ్ర జ్వరం ఉండడం వల్ల ఆయన హైదరాబాద్ కి వెళ్ళిపోయారు.

బాబు ఒక్కరే అక్కడ :

ఈ నేపధ్యంలో విజయవాడ లోక్ భవన్ లో జరిగిన ఎట్ హోం కి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీసమేతంగా హాజరయ్యారు. గవర్నర్ అద్బుల్ నజీర్ దంపతులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు చంద్రబాబు దంపతులు ముచ్చటించుకోవడం కనిపించింది. ఇక ఒక్కసారి ఎనిమిది నెలలు ముందుకు వెళ్తే ఈ ఏడాది జనవరి 26న జరిగిన ఎట్ హోం కి చంద్రబాబు దంపతులు, అటు పవన్ కళ్యాణ్ దంపతులు ఇటు నారా లోకేష్ అంతా హాజరయ్యారు. సందడే సందడిగా ఎట్ హోం సాగింది. దాని కంటే ముందు ఏడాది జరిగిన ఎట్ హోం కి పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల కూడా హాజరై ఆసక్తిని కలిగించారు.

మంచి వేదికగానే :

ఎట్ హోం సంప్రదాయం ఒక మంచి వేదికగా ఉంటుంది. గవర్నర్ ఏర్పాటు చేసే తేనీటి విందు కాబట్టి అక్కడ అంతా హాజరవుతారు. రాజకీయాలకు అతీతంగా అంతా కలసి ముచ్చటించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. వివిధ రాజకీయ పార్టీలు అంతా కలసి కనిపించే ఉమ్మడి వేదిక కూడా అదే అవుతుంది. అయితే ఏపీలో ఎపుడూ రాజకీయం భిన్నంగా సాగడం తోనే ఎట్ హోం కి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హాజరు కావడం లేదు, జగన్ రాకపోవడం కూడా ఒక లోటుగానే అంతా చూస్తారు. ఇపుడు కారణాలు ఏమి అయినా ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనాల్సిన పవన్ కూడా రాలేకపోవడంతో ఎట్ హోం కి ఈసారి కొంత ఆకర్షణ తగ్గిందనే అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఎట్ హోం లో పాలుపంచుకుని ప్రత్యేక ఆకర్షణగా అంతా తానై నిలవడం మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది.