రుషికొండపై కీలక నిర్ణయం.. జగన్ కలల భవనం ఏం చేస్తారంటే..?
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 18 Dec 2025 7:00 AM ISTరుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రుషికొండపై సుమారు రూ.450 కోట్లతో పర్యాటకశాఖ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ భవనాలుగా చెప్పినా, అప్పటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించారని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ భవనాలను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రివర్గ ప్రముఖులు, కూటమి నేతలు రుషికొండ భవనాల వినియోగంపై తీవ్ర చర్చలు జరిపారు. అసెంబ్లీ వేదికగా కూడా చర్చించినా, భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గతంలో నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో రుషికొండ భవనాల వినియోగంపై పర్యాటక శాఖ పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఒకప్పుడు ఏడాదికి 8 కోట్ల ఆదాయం ఇచ్చే పున్నమి రిసార్ట్స్ రుషికొండపై ఉండేవని, వాటిని తొలగించి నిర్మించిన భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకపోగా, నెలకు రూ.20 నుంచి రూ.30 లక్షలు వృథాగా ఖర్చు చేయాల్సివస్తోందని ప్రభుత్వం అంటోంది. ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ భవనాలను లీజుకు అడిగినట్లు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రభుత్వానికి భారంగా మారిన రుషికొండ భవనాలను వినియోగించడానికి టాటా, ఆట్మాస్ఫియర్ కోర్, హెచ్సీఎల్, హెచ్ఈఐ హోటల్స్ ముందుకొచ్చారని పర్యాటక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో రుషికొండ ప్యాలెస్ నిర్వహణ నుంచి తప్పుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించినట్లైందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం రుషికొండ భవనాల లీజుపై ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. ఒకటికి మించిన సంస్థలు రుషికొండ భవనాల వినియోగంపై ముందుకురావడంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.
గత 18 నెలలుగా తీవ్ర తర్జనభర్జనకు గురైన అంశంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఎట్టకేలకు ప్రభుత్వానికి లభించినట్లుగా చెబుతున్నారు. వృధాగా ఉన్న భవనాలను వినియోగించడంతోపాటు వాటి కోసం ప్రతినెలా చేస్తున్న ఖర్చు తగ్గడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లే ముందు సీఎం చంద్రబాబుతోనూ ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందంటున్నారు.
మొత్తానికి ఇన్నాళ్లకు రుషికొండ ప్యాలెస్ ను వదిలించుకునే అంశంపై ప్రభుత్వం సీరియస్ గా చర్చిస్తోందని అంటున్నారు. గత ప్రభుత్వంలో విమర్శలకు కేంద్రంగా మారిన రుషికొండ భవనాలను ఏం చేస్తారన్న విషయమై ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ప్రజల సందర్శనకు ఉంచాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలించింది. అయితే ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉందన్న కారణంతో ప్రైవేటుకు అప్పగించాలనే ప్రతిపాదననే ఎక్కువగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఏదిఏమైనా ఈ నెలాఖరులో రుషికొండపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.
