ఎల్పీజీ టూ పీఎన్జీ ... లక్ష కనెక్షన్లు టార్గెట్
ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పీఎన్జీ వాడకాన్ని పెంచాలని పదే పదే కోరుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇపుడు పీఎన్జీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
By: Satya P | 26 March 2026 10:44 PM ISTభవిష్యత్తు వైపు అంతా ఆలోచించాల్సిన అవసరాన్ని అనివార్యతను గల్ఫ్ యుద్ధం క్రియేట్ చేసింది. ఒక వేళ ఈ యుద్ధం కనుక జరగకపోయి ఉంటే బహుశా పీఎన్జీ అన్న పదం చాలా మందికి తెలిసేది కాదు, ఇపుడు ప్రభుత్వాలు అన్నీ దీని మీదనే ఫుల్ ఫోకస్ పెడుతున్నాయి. పీఎంజీ వైపుగా టర్న్ కావాలని కోరుతున్నాయి. అదే రేపటి తరానికి ధీమా కలిగించేది అని చెబుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పీఎన్జీ వాడకాన్ని పెంచాలని పదే పదే కోరుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇపుడు పీఎన్జీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
దీపం పధకం లబ్ధిదారులు పీఎన్జీ కి :
నెల రోజుల వ్యవధిలో లక్ష దాకా పీఎన్జీ కనెక్షలు టార్గెట్ గా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. కేవలం ఇరవై నాలుగు గంటలలో పీఎన్జీ కనెక్షన్లకు అనుమతులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. అపార్ట్మెంట్లు వాణిజ్య వర్గాలు పీఎన్జీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దీని వల్ల పర్యావరణ హితం తో పాటు ధర తక్కువ సైతం కాబట్టి పీఎన్జీ సదుపాయంపై అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచిస్తున్నారు. గతంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం దీపం పథకం కింది ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేసింది. ఇపుడు దీపం పధకం లబ్ధిదారులు పీఎన్జీ కి మారే విధంగా అవకాశం కల్పిస్తున్నామని మంత్రి ప్రకటించారు.
పట్టణాల నుంచే :
ఇక రాష్ట్రంలోని విజయవాడ,గుంటూరు, నెల్లూరు,కాకినాడ,విశాఖపట్నం, తిరుపతి తదితర నగర ప్రాంతాలలో ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న వినియోగ దారులను పైప్డ్ నేచురల్ గ్యాస్జీ పీఎన్జీ వైపుగా మళ్లించే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా అందుబాటులో ఉండడంతో పాటు అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సదుపాయాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి,విజయవాడ కనకదుర్గ దేవస్థానం,శ్రీ కాళహస్తి, అన్నవరం,సింహాచలం దేవాలయాలలో సైతం పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటిన్లకు కూడా పీఎన్జీ కనెక్షన్లు అందించాలన్న నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
సబ్సిడీ కంటిన్యూ :
అదే విధంగా దీపం పథకం కింద నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ ని ప్రభుత్వం అందిస్తోంది. పీఎంజీ వినియోగదారులకు నిబంధనల మేరకు రెండు నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులని కూటమి ప్రభుత్వం చేయనున్నట్లుగా మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అలా మూడు సిలిండర్లకు సంబంధించి ఇచ్చే డీబీటీ మొత్తం 2400 రూపాయలను పీఎన్జీ వినియోగదారులకు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో దాదాపు 94 లక్షల దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరందరికీ పీఎన్జీ జీ వైపుగా మళ్ళిస్తే ప్రభుత్వం లక్ష్యం సక్సెస్ అయినట్లే అంటున్నారు.
లాభాలేంటి :
ఇదిలా ఉంటే పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు పీఎన్జీ గా చెబుతారు. పీఎంజీ అనేది ప్రధానంగా మీథేన్‌తో కూడిన ఒక సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన సౌకర్యవంతమైన ఇంధనంగా ఉంటుంది. దీనిని వంట చేసుకోవడానికి పదార్థాలు వేడి చేసుకోవడానికి ఉపయోగిస్తారు. భూగర్భ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేస్తారు. ఇది నిరంతరాయంగా మీటర్‌తో కూడిన సరఫరాను అందిస్తుంది, సిలిండర్లను నిల్వ చేయడం చేతితో మార్చడం వంటి పనులు పీఎన్జీ తో పూర్తిగా అవసరం లేకుండా పోతాయి. అంతే కాదు పీఎన్జీ గాలి కంటే తేలికైనది కాబట్టి ఎల్పీజీ కంటే ఎక్కువ ఖర్చు ఆదా అవుతుంది. అలా ఇరవై నుంచి ముప్పై శాతం ఆదాతో పాటుగా సురక్షితమైన గ్యాస్ గా చెబుతారు.
పర్యావరణ అనుకూలమైనది:
ఇక ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ మరింత శుభ్రంగా మండుతుంది, అలాగే తక్కువ గ్రీన్‌హౌస్ వాయువులను అతి తక్కువ కాలుష్య కారకాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దాంతో పీఎన్జీ వైపుగా మళ్ళడం ఉత్తమ మార్గం అని అంతా సూచిస్తున్నారు. అయితే దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సొంతంగా ఇళ్ళు ఉన్న వారు మాత్రమే ఉపయోగించుకోగలరు. అలాగే అద్దె ఇళ్ళలో ఈ సదుపాయం ఉంచినా వాడుకునే వీలు ఉంటుంది. అలా స్థానికంగా పైపింగ్ మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. అందుకే ఎక్కువగా అపార్ట్మెంట్స్, హొటెల్స్, వాణిజ్య అవసరాలకు దీనిని మళ్ళించినా ఎల్పీజీ మీద పెను భారం తగ్గుతుందని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.
కేంద్రం ప్రోత్సాహం :
మరో వైపు చూస్తే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి ఇంధన వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు పీఎన్జీ కి మారాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. పీఎన్జీ కి విస్తృతంగా మారాలని ఏకంగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం పీఎన్జీ కనెక్షన్లు ఉన్న గృహాలు ఎల్‌పిజి సిలిండర్ల వాడకాన్ని నిలిపివేయాలని అధికారులు సూచిస్తున్నారు.
