Begin typing your search above and press return to search.

రేషన్ పై ఏపీ పద్దతిని ఫాలో అవ్వండి రేవంత్

రేషన్ షాపుల ద్వారా అందించే రేషన్ బియ్యం విషయానికి వస్తే.. దశాబ్దాలుగా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తున్నా.. ఇప్పటికి సామాజిక పరిస్థితుల్లో మార్పు రాలేదన్నట్లుగా రేషన్ బియ్యం కోసం దరఖాస్తు చేసుకునే వారే కనిపిస్తారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 4:00 PM IST
రేషన్ పై ఏపీ పద్దతిని ఫాలో అవ్వండి రేవంత్
X

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా.. వాటి ప్రయోజనాన్ని వారికి అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకు భిన్నంగా వందలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా.. సంక్షేమ పథకాల లబ్థిదారులకు ఆ ప్రయోజనం అందని పరిస్థితి ఉంటే.. దాని కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి మైలేజ్ ఉండదు. అంతేకాదు.. సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు రాదు. ఇంతకూ ఏ విషయంలో అంటారా? అక్కడికే వస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా అందించే రేషన్ బియ్యం విషయానికి వస్తే.. దశాబ్దాలుగా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తున్నా.. ఇప్పటికి సామాజిక పరిస్థితుల్లో మార్పు రాలేదన్నట్లుగా రేషన్ బియ్యం కోసం దరఖాస్తు చేసుకునే వారే కనిపిస్తారు.

ఇంతా చేసి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎంత మంది తమ సొంత అవసరాల కోసం వినియోగిస్తున్నారన్నది చూస్తే.. ప్రతి పది మందిలో ముగ్గురు.. నలుగురు మినహాయించి మిగిలిన వారంతా వారంతా తక్కువ ధరలకు హోటళ్లకు.. వ్యాపారులకు అమ్మేస్తున్న పరిస్థితి. దీనికికారణం ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత లేకపోవటమే. అదే సమయంలో రేషన్ బియ్యం కంటే మెరుగైన బియ్యాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు వాడుతున్నారు. ఈ కారణంగానే రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చూస్తున్నదే.

ఈ రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం వినూత్న విధానానికి తెర తీయాలని భావిస్తోంది. రేషన్ బియ్యం వద్దనుకునే లబ్థిదారులకు.. వారి ఖాతాల్లోనే నేరుగా డబ్బులు వేసే కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లు ప్లానింగ్ జరుగుతోంది. అయితే.. ఇది వాస్తవ రూపంలోకి రావటానికి కొంత సమయం పట్టొచ్చు. ఒకవేళ ఇదే వాస్తవ రూపం దాలిస్తే మాత్రం.. రేషన్ మాఫియాను సమూలంగా నాశనం చేసే వీలుందని చెప్పాలి. అంతేకాదు.. బియ్యం నాణ్యత అంశం మీద కూడా ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టే వీలుంది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. గత నెలలో మొదలైన సన్న బియ్యం పంపిణీ సానుకూల ఫలితాల్ని ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. రేషన్ లో గతంలో ఇచ్చే బియ్యం కంటే సన్న బియ్యాన్ని తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. సన్న బియ్యంలో ఇప్పుడు అందిస్తున్న క్వాలిటీని కంటిన్యూ చేయటం అతి పెద్ద సవాలుగా భావిస్తున్నారు.

ఇలాంటి వేళ.. ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు.. రేషన్ బియ్యానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇచ్చే అంశం మీద తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తే ప్రయోజనం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. లబ్థిదారులకు మేలు జరగటంతో పాటు.. తమకు వచ్చే బియ్యాన్ని పదికి.. పాతిక్కు అమ్మేందుకు బదులుగా.. ప్రభుత్వంఇచ్చే నగదుతో తమకు నచ్చిన బియ్యాన్ని కొనుగోలు చేస్తారని చెప్పాలి. మరి.. ఏపీ ఆలోచిస్తున్న అంశాన్ని రేవంత్ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తే.. లబ్థిదారులకు మంచి జరిగే వీలుందని చెప్పక తప్పదు.