సంక్షేమ పధకాలు వారికి కట్...ఎందుకలా ?
ఏపీలో సంక్షేమ రాజ్యం నడుస్తోంది. అడిగిన వారిలో అర్హత ఉంటే చాలు ఇస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలను కేవలం సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 July 2025 3:00 AM ISTఏపీలో సంక్షేమ రాజ్యం నడుస్తోంది. అడిగిన వారిలో అర్హత ఉంటే చాలు ఇస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలను కేవలం సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారు. ఏపీలో కోటిన్నరకు పైగా కుటుంబాలకు సంక్షేమ పధకాలు అందుతున్నాయంటే దేశంలో మరే రాష్ట్రంలో ఇంతలా లేదని చెప్పాలి. అలాంటి ఏపీలో వారందరికీ పధకాలు ఇవ్వమని ఒక కేబినెట్ మినిస్టర్ చెప్పారు అంటే ఏమి జరిగింది వారు చేసిన పాపమేంటి అన్న చర్చ వస్తుంది.
పైగా వారిలో మేము ఉన్నామా అన్న భయం కలవరం కూడా పధకాల లబ్దిదారులలో కలుగుతుంది. అయితే వారు అంటే ఒక సెక్షన్. ఎంత చెప్పినా వినని వారు, ఏపీకి చెడ్డ పేరు తెస్తున్నారు. గంజాయిని ప్రమోట్ చేస్తూ అక్రమ రవాణా చేస్తూ ఏపీ ఖ్యాతిని దెబ్బ తీస్తున్న వారు వారికి ఎన్నో విధాలుగా చెప్పి చూసినా ఇదే విధంగా చేస్తూండడంతో ప్రభుత్వం ఏకంగా మూడో కన్ను తెరచింది.
అందుకే హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగానే కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి రేషన్ సహా సంక్షేమ పధకాలను కట్ చేసి పారేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. అయినా సరే ఒక లాస్ట్ చాన్స్ అన్నట్లుగా వారు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని కోరారు. లేకపోతే తాము చెప్పింది చేసి తీరుతామని ఆమె స్పష్టం చేపడం విశేషం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని గంజాయి రహితంగా తయారు చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు ఆ దిశగా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యామని అన్నారు. ఒకనాడు ఏపీ అంటే గంజాయి స్టేట్ గా బయట వారు అనుకునే పరిస్థితి ఉండేదని ఆమె అన్నారు.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 వేల ఎకరాలలో గంజాయి సాగు జరుగుతూంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలోనే కేవలమ్ తొంబై ఎకరాలకు తీసుకుని వచ్చామని హోం మంత్రి చెప్పారు. ఏజెన్సీలో ఆల్టర్నేషన్ పంటలకు ప్రభుత్వం సాయం చేయడంతో పాటు పండ్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గంజాయిని పూర్తిగా నిర్మూలించామని అన్నారు.
అరకు అంటే కాఫీగా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశామని అంతర్జాతీయగా ఇపుడు ఆ పేరే వినిపిస్తోందని అన్నారు అలా గిరిజనానికి ఉపాధితో పాటు పేరు కూడా వచ్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. మరో వైపు గంజాయ్ బ్యాచ్ ని గుర్తించి పెద్ద ఎత్తున శిక్షలను అమలు చేశామని అన్నారు. కేవలం ఏడాది కాలంలో 831 కేసులు నమోదు చేసి 2014 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. పోలీసులు గంజాయి మీద ఉక్కు పాదం మోపారని కూడా ఆమె చెప్పారు.
ఏడాది కాలంలో 24 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆమె అంటూ ఇది ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల ఫలితంగా చెప్పారు. గంజాయి సాగుని ప్రోత్సహించే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారి ఆస్తులను సీజ్ చేశామని అలా 7.5 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు ఆపరేషన్ గరుడ ద్వారా కూడా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టామని అలా 150కి పైగా షాపులను మూసివేయించామని అన్నారు.
ఆధునిక సనకేతకతో గంజాయి రవాణాను అరికడుతున్నామని హోం మంత్రి చెప్పారు. మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలించే క్రమంలో డేటా సెంటర్ ని తొందరలో ప్రారంభించి ఆధునిక నెట్ వర్క్ తో వీటి గుట్టు మరింతగా చేదిస్తామని ఆమె స్పష్టం చేశారు. అంతే కాకుండా గంజాయి విషయంలో ఎవరైనా పండించినా రవాణా చేసినా వారికి రేషన్ సహా ప్రభుత్వ పధకాలు అన్నీ కట్ చేసి పారేస్తామని ను అనిత హెచ్చరించారు మరి ఈ హెచ్చరికల ఫలితాలు తొందరలో వస్తాయా అన్నది చూడాల్సి ఉంది.
