ఒకే బస్సులో చంద్రబాబు, పవన్, లోకేశ్.. ఉచిత బస్సు ప్రారంభంలో అరుదైన దృశ్యం
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉచిత బస్సు ప్రయాణ పథకం - స్త్రీ శక్తిని ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అదే బస్సులో ఉండవల్లి నుంచి విజయవాడ పీఎన్ బస్టాండ్ వరకు వచ్చారు.
By: Tupaki Desk | 16 Aug 2025 1:17 AM ISTఏపీలో ఉచిత బస్సు పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముందుగా చెప్పినట్లే ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. విజయవాడలోని పండింట్ నెహ్రూ బస్ స్టాండులో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఆయనతోపాటు పలువురు మహిళలు అదే బస్సులో ప్రయాణించారు. మార్గమధ్యలో మహిళలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు పలు విషయాలపై చర్చించారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉచిత బస్సు ప్రయాణ పథకం - స్త్రీ శక్తిని ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అదే బస్సులో ఉండవల్లి నుంచి విజయవాడ పీఎన్ బస్టాండ్ వరకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు సీటులో కూర్చోగా ఆయన వెనక సీట్లో పవన్ కల్యాణ్, ఆ వెనక సీట్లో లోకేశ్, ఆయన వెనుక బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూర్చొన్నారు. మిగిలిన సీట్లలో పూర్తిగా మహిళలే ఉన్నారు. అధికారులు తమ వాహనాల్లో ముఖ్యమంత్రి ప్రయాణించిన బస్సును అనుసరించారు.
ఉండవల్లిలో ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయలు దేరిన బస్సు తాడేపల్లి మీదుగా విజయవాడ - గుంటూరు హైవేలోని వారది జంక్షన్ కు చేరుకుంది. అక్కడి నుంచి కృష్ణలంక మీదుగా విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ కాలేశ్వరరావు మార్కెట్ మీదుగా పీఎన్ బస్టాండ్ వరకు చేరుకుంది. ఇక విజయవాడలో దారిపొడవునా సుమారు ఐదారు కిలోమీటర్లు మహిళలు రోడ్డు పక్కన నిల్చొని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. దారిపొడువునా మహిళలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందుగా బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉచిత బస్సును ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా జెండా ఊపి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. విజయవాడ బస్టాండ్ నుంచి ఐదు రకాల బస్సులు మహిళలతో బయలుదేరి వెళ్లాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలు అమలు చేయగలమా? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారని, కానీ ప్రజలు మద్దతుతో కొండలను అయినా పిండి చేయగల శక్తి తనకు ఉందని చెప్పానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి అడుగులు వేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటి నుంచి శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకు మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై ఆడబిడ్డలను అత్తింటి నుంచి కన్నవారి ఇంటికి తేడానికి ఉచితంగా ప్రయాణించవచ్చని నవ్వుతూ చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ఇక ఇదే సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే బస్సుల్లో మహిళలకు రిజర్వేషను అమలు చేశామని, ఆర్టీసీలో మహిళా కండక్టర్లను నియమించామని, ఇప్పుడు మహిళలు ఉచితంగా తిరిగే సౌకర్యాన్ని తీసుకువచ్చామని వివరించారు.
