కరెంటు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?
కొత్త సంవత్సరంలో కరెంటు చార్జీల షాకుల నుంచి కూటమి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సుమారు రూ.4,497 కోట్ల విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు నిర్ణయించింది.
By: Tupaki Desk | 2 Jan 2026 8:06 PM ISTకొత్త సంవత్సరంలో కరెంటు చార్జీల షాకుల నుంచి కూటమి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సుమారు రూ.4,497 కోట్ల విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు నిర్ణయించింది. ట్రూడౌన్ కింద ఈ మొత్తం భరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు విద్యుత్తు సంస్థలకు లేఖ రాసింది. గత ఏడాది సెప్టెంబరు నెలలో రూ.923 కోట్ల రూపాయలను ప్రభుత్వం తగ్గించింది. తాజాగా మళ్లీ తగ్గించడంతో విద్యుత్ చార్జీలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెరుగైన పర్యవేక్షణతో విద్యుత్ వ్యవస్థ గాడిన పడిందని, ఈ కారణంగానే విద్యుత్ చార్జీలు తగ్గుతున్నాయని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ప్రభుత్వం పీపీఏల రద్దు చేయడం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను నాశనం అయిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరా, విద్యుత్ కొనుగోళ్లలో పొదుపు పాటించడం వల్ల చార్జీలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచేసి ప్రజలపై భారీగా ఆర్థిక భారాన్ని మోపితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టాలను అధిగమించడంతో ప్రజలకు విద్యుత్ చార్జిల భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు ట్రూ అప్ చార్జిల రూపంలో ఎప్పుడో వినియోగించిన కరెంటుకు బిల్లులను చెల్లించిన వినియోగదారులు ఇక నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
దీంతో ఈ ఏడాది విద్యుత్ చార్జీలు భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం వల్లే ప్రజలకు మేలు కలిగిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధర రూ.5.19 నుంచి రూ.4.80కు తగ్గిందని వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కూడా కరెంటు భారాన్ని మోపకుండానే ఒక్కో యూనిట్ పై 13 పైసలు చొప్పున తగ్గించినట్లు టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు.
ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2019-20 నుంచి 2023-24 వరకు వినియోగదారులు వినియోగించిన విద్యుత్ కు సంబంధించిన ట్రూఅప్ పై ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం మూడు డిస్కంలు విద్యుత్ సరఫరాకు అయిన ఖర్చుకు ఆదాయానికి మధ్య వ్యత్యాసం రూ.12,771 కోట్లుగా పేర్కొన్నాయి. ఈ మొత్తంలో రూ.8,274 కోట్లను ఏపీఈఆర్సీ అనుమతించలేదు. ఇందులో క్వారీయింగ్ కాస్ట్ రూ.4,149 కోట్లు. ఇతర ఖర్చులు, బిల్ డిస్కౌంటింగ్, బ్యాడ్ డెట్స్, షార్ట్ టర్మ్ రుణాలు వంటివి ఉన్నాయి. ఏపీఈఆర్సీ తిరస్కరించిన మొత్తం తర్వాత నికర ట్రూ అప్ రూ.5,933 కోట్లకు దగ్గింది. దీనిలో గతంలో తగ్గించిన రూ.1,435 కోట్లను కూడా తగ్గించిన తర్వాత నికర మొత్తం రూ.4,497 కోట్లుగా తేలింది. ఈ నికర మొత్తాన్ని తానే భరిస్తానని ప్రభుత్వం లేఖ రాయడంతో ఆ మేరకు కరెంటు బిల్లులు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
