కూటమి నయా ప్లాన్.. ప్రతీ జిల్లాలో బడ్జెట్ మీట్
తొందరలోనే తేదీలని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఏపీలో ఉన్న మొత్తం 28 కొత్త జిల్లాలలో ఈ బడ్జెట్ మీట్ ఉంటుందని అంటున్నారు.
By: Satya P | 12 March 2026 7:00 AM ISTప్రతీ జిల్లాలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ లోని కేటాయింపులు ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాలు పధకాలు అందరికీ సవివరంగా తెలియచేయాలని సరికొత్త ఆలోచనలో సర్కార్ ఉంది. ఈ మేరకు అధికారులకు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు ఇచ్చారు. తొందరలోనే తేదీలని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఏపీలో ఉన్న మొత్తం 28 కొత్త జిల్లాలలో ఈ బడ్జెట్ మీట్ ఉంటుందని అంటున్నారు.
ప్రజల చెంతకు చేరేలా :
ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఈసారి బడ్జెట్ ని మూడు లక్షల 34 వేల కోట్లకు పైగా భారీ నెంబర్ తో ప్రవేశపెట్టింది. ఇందులో మూల ధన వ్యయానికి పెద్ద పీట వేసింది. అలాగే బడ్జెట్ లో సంక్షేమానికి అభివృద్ధికి కూడా తగిన కేటాయింపులు చూపించారు. దీంతో ఈసారి ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా అన్ని జిల్లాల అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు చేస్తూ సమగ్రమైన ప్రగతికి దారులు తీసారని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని వెనుకబడిన వర్గాలకు అణగారిన వారికి బడ్జెట్ లో కీలకమైన భాగం ఇచ్చారని అంటున్నారు దాంతో ఈ బడ్జెట్ లో ఏముంది అన్నది అందరికీ తెలియాలి అన్నది ఆర్ధిక మంత్రిగా పయ్యావుల కేశవ్ వినూత్న ఆలోచనగా చెబుతున్నారు.
అన్ని వర్గాలతో చర్చ :
ప్రతీ జిల్లాలో బడ్జెట్ మీద చర్చకు అన్ని వర్గాలని పిలుస్తారని అంటున్నారు. అలాగే ఆయా జిల్లాలకు బడ్జెట్ లో ఎంత కేటాయించారు, ఏఏ రంగాలకు కేటాయించారు అన్నది అక్కడే విడమరచి చెబుతారు అని అంటున్నారు. అలాగే ఆ జిల్లాలో ఉన్న జనాభా వెనకబడిన వర్గాల కోసం బడ్జెట్ ఏమి చేసింది అన్నది కూడా పూర్తిగా తెలియచేస్తారు అని అంటున్నారు. ఈ బడ్జెట్ మీద చర్చకు మేధావులతో పాటు వివిధ రంగాల నిపుణులునను కూడా ఆహ్వానిసారు అని అంటున్నారు. అలాగే బడ్జెట్ లో ఆ జిల్లాకు కేటాయింపులను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియచేస్తారు అని అంటున్నారు.
ముందే బడ్జెట్ ఆమోదం :
సాధారణంగా బడ్జెట్ ఆమోదం అన్నది మార్చి నెలాఖరుతో పూర్తి అవుతుంది. కానీ నెల రోజులు ముందుగానే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ని ఆమోదించింది అని మంత్రి పయ్యావుల గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఒక విజన్ తో బడ్జెట్ ని రూపకల్పన చేశామని ఆయన చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో ప్రజలకు చేసిన మంచి అన్నది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతోనే జిల్లాల వారీగా బడ్జెట్ మీట్ ని నిర్వహించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని అధికారులు ఆయా జిల్లాలలో ఒక్క పైసా కూడా వదిలేయకుండా ఖర్చు చేయాలని కోరామని చెప్పారు. ఈ బడ్జెట్ మీద విపక్షాల విమర్శలకు జిల్లాలని బడ్జెట్ సెషన్లు మీటింగుల ద్వారానే తగిన జవాబు చెప్పాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు.
