Begin typing your search above and press return to search.

మళ్ళీ మాస్క్...కరోనాతో ముప్పు ఎంత ?

ఏపీలో కరోనా మహమ్మారి నెమ్మదిగా విస్తరించింది. అక్కడా ఇక్కడా కేసులు అంటూ మొదలైన ఈ వైరస్ ఇప్పుడు వివిధ జిల్లాలకు పాకేసింది.

By:  Satya P   |   17 July 2026 11:12 PM IST
మళ్ళీ మాస్క్...కరోనాతో ముప్పు ఎంత ?
X

ఏపీలో కరోనా మహమ్మారి నెమ్మదిగా విస్తరించింది. అక్కడా ఇక్కడా కేసులు అంటూ మొదలైన ఈ వైరస్ ఇప్పుడు వివిధ జిల్లాలకు పాకేసింది. ఇక చూస్తే ఈ వ్యాధి వల్ల ఇప్పటికే నలుగురు మృతి చెందారు. దాంతో జనాలలో ఆందోళన మరింతగా ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో కరోనా ఏపీలో చూపించే ప్రభావం ఎంత గత అనుభవాలతో జనాలు ఏమి చేయాలి అధికారులు ప్రభుత్వం చెబుతున్నదేంటి అన్నది ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. కరోనా అంటేనే మహమ్మారి అన్నది అందరికీ తెలుసు. ఇది ప్రాణాంతకంగా మారి 2019 నుంచి 2022 దాకా జనాలను భయపెట్టింది. అనేక మరణాలు కూడా కరోనా కారణంగా సంభవించాయి. ఈ మధ్య మూడేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్న ఈ వైరస్ ఇపుడే హఠాత్తుగా విజృంభించడానికి రీజన్స్ ఏంటి అన్నది కూడా చర్చ సాగుతోంది.

ఏపీలో లెక్క ఇదే :

దేశంలో కరోనా వివరాలు అయితే గత నెల 26 నుంచే అందుబాటులోకి వచ్చాయి. అంటే అప్పటి నుంచే దీని సీరియస్ నెస్ ని గుర్తించి డేటాను కలెక్ట్ చేయడం మొదలెట్టారు అనుకోవాలి. ఆ విధంగా చూస్తే జూలై 15 నాటికి దేశంలో 339 కరోనా కేసులు ఉన్నట్లుగా అధికారిక గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇక ఏపీలో చూస్తే అధికారికంగా పద్నాలుగు కేసులు మాత్రమే వివిధ జిల్లాలఓ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది, గుంటూరు జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో రెండు, కాకినాడ జిల్లాలో రెండు కేసులు నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. అనేక మందిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి ఉన్నాయి. అయితే ఇవి సీజనల్ గా వచ్చేవి అని భావించినా పరీక్ష చేస్తే కరోనా అని తేలడంతోనే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఆందోళన వద్దు అంటూ :

ఇదిలా ఉంటే ఏపీలో రాష్ట్రంలో కరోనా కేసుల పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్నవి సాధారణ కేసులేనని అందువల్ల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అంటూ మంత్రి గట్టి భరోసా ఇచ్చారు. ఇక కరోనా అంటూ మరణించిన ఆ నాలుగు కేసుల వెనక కూడా కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీరంతా కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవించడం లేదని, కొవిడ్‌తో పాటు దీర్ఘకాలిక సమస్యలు అయిన హెమటాలజీ హైబీపీ వంటివి ఉన్నవారికి మాత్రమే ఇబ్బందులు తలెత్తినట్లుగా మంత్రి తెలిపారు. అదే సమయంలో కరోనా పట్ల పూర్తి అప్రమత్తంగా ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. అందుకే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు, పీపీఈ కిట్లు, అవసరమైన మందుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులు ప్రతిరోజూ కరోనా వ్యాప్తి మీద అంచనా వేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు అంతా అప్రమత్తంగా ఉన్నారని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

వేగంగానే విస్తరణ :

గడచిన ఇరవై రోజుల వ్యవధిలో 12 నుంచి 14 దాకా కరోనా కేసులు ఏపీలో బయటపడ్డాయి. తొలి కేసు జూన్ 26న కడపలో నమోదు అయితే జూలై 1 నుంచి 15 మధ్యలో ఏకంగా 13 దాకా కేసులు నమోదు కావడం జరిగింది. గుంపులు గుంపులుగా ఒకే చోట కేసులు బయటపడటం లేదని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుదల పట్ల అయితే వైద్య ఆరోగ్యణ శాఖ అలెర్ట్ గానే ఉందని అంటున్నారు.

వైరస్ రకమే ఇంపార్టెంట్ :

కరోనాలో సవా లక్ష రకాలు ఉన్నాయి. ఇందులో ప్రమాదం లేనివే ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో విస్తరిస్తున్న కరోనా రకం ఏమిటి అన్నదే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీంతో ఈ నెల 9న పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జినోం సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అక్కడ నుంచి వివరాలు వస్తే మరింత ఎక్కువగా సమాచారం ఈ కరోనా మీద తెలుస్తుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కరోనా లక్షణాలు అయిన జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి ఉంటే కనుక ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. అదే విధంగా జన సమ్మర్ధం లో ఉన్నపుడు మాస్కులను వాడడం చేతులు శుభ్రాన్ని ఎప్పటికప్పుడు చేసుకోవడం వంటివి పాటించాలని అధికారులు కోరుతున్నారు.