కూటమి సర్కారుకు మండలి చైర్మన్ షాక్.. మోషేన్ రాజు దెబ్బకు విలవిల
ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Political Desk | 28 Feb 2026 12:35 PM ISTఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేసి మండలి చైర్మన్ మోషేన్ రాజు కలకలం రేపారు. అంతేకాకుండా తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చను పాలకపక్షమే అడ్డుకుందని సభలో ప్రకటించి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీనిపై అధికార పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ పరిణామంతో మండలి సమావేశాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయని అంటున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధమే సాగుతోంది. గత మంగళవారమే ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. ఆ మరునాడు మండలిలో చర్చించాలని అనుకున్నా కుదరలేదు. ఇక గురువారం సభలో చర్చ జరగాల్సివుండగా, ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన చేయాలని ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య వాదులాట జరగడంతో సభలో గందరగోళం చోటుచేసుకుని వాయిదా పడింది. విపక్షం చర్చకు నోటీసు ఇవ్వకుండానే సభలో మాట్లాడే ప్రయత్నం చేసిందని అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతోనే సభలో తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇక శుక్రవారం సభలో చైర్మన్ ప్రకటన చేస్తూ అధికార పక్షంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాలకపక్షమే గురువారం చర్చ జరగకుండా అడ్డుకుందని ఆయన ఆరోపించారు. దీనిని మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు ఖండిస్తూ విపక్షమే అడ్డుకుందని ప్రత్యారోపణలు చేశారు. అయినప్పటికీ చైర్మన్ తన ప్రకటనను కొనసాగిస్తూ సభలో చైర్ ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ ను కొనసాగించాలని ప్రభుత్వం పట్టుబట్టి లడ్డూ ప్రసాదంపై లఘు చర్చను అడ్డుకునే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనపై సత్యదూరమైన ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చైర్మన్ చేసిన ప్రకటన అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. మండలి చైర్మన్ మోషేన్ రాజు విపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అర్థం వచ్చేలా గురువారం సభ వాయిదా పడిన తర్వాత అధికార పార్టీ నేతలు చేసిన విమర్శలకు చైర్మన్ మండలిలోనే కౌంటర్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తూ, సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారిని తాము అవమానించలేదని మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, చైర్మన్ అడ్డుకున్నారు. ఇక వదిలేయండి ఇంతకు మించి అమనానించాలనుకుంటే కరెక్టు కాదు అంటూ చైర్మన్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
