అలాంటి వారు రాష్ట్రం బయటే.. చంద్రబాబు కీలక నిర్ణయం!
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఏ మాత్రం ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
By: Tupaki Desk | 18 Dec 2025 7:00 PM ISTరాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఏ మాత్రం ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో చివరిగా శాంతిభద్రతలపై సమీక్షించారు. ఇందులో జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా పేట్రేగిపోవడం, హత్యలకు పాల్పడటాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో రౌడీయిజం అనేది ఉండకూడదని, రౌడీయిజం అభివృద్ధికి విఘాతమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రౌడీల కట్టడి, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, మతపరమైన గొడవలుపై పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రౌడీల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రౌడీలు అనే వారు రాష్ట్రంలో ఉండేందుకు వీళ్లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అవసరమైతే నోటోరియస్ రౌడీలను రాష్ట్రం నుంచి బహిష్కరించేందుకు వెనుకాడొద్దని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ‘రౌడీల విషయంలో కఠినంగా ఉండాల్సిందే... అప్పుడే పరిస్థితి నియంత్రణలోకి వస్తుంది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర బహిష్కరణ విధించాలి. జిల్లాల్లో ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి హెచ్చరించండి... లొంగకపోతే పీడీ యాక్టును ప్రయోగించండి’ అంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు.
నెల్లూరులో లేడీడాన్స్ ఎలా చెగిరేగిపోయారో సీఎం గుర్తు చేశారు. గంజాయి వ్యాపారం చేసిన మహిళలు.. తమ వ్యాపారానికి అడ్డం వస్తున్న వ్యక్తులను చంపే వరకు వెళ్లడం ఏంటని? చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటివరకు సినిమాల్లోనే ఈ తరహా వ్యవహారాలు చూశాం.. శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్సు, సమీక్షలు అనేవి మొక్కుబడి కోసం కాదు. శాంతి భద్రతల విషయంలో సీరియస్సుగానే ఉంటామని సీఎం స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లకి పోలీసు అంటే భయం ఏర్పడేలా చేయాలని, అప్పుడే తప్పు చేయడానికి వెనుకాడతారని సీఎం వ్యాఖ్యానించారు.
అదేవిధంగా రాష్ట్రంలో మహిళలపై నేరాలు అరికట్టాలని, శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని ఎస్పీలకు స్పష్టం చేశారు. మహిళా భద్రతా విభాగం ద్వారా సెల్ఫ్ డిఫెన్సుపై మంచి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే 22.5 శాతం తగ్గడం మంచి పరిణామని అభినందించారు. సున్నిత గ్రామాల్లో నిరంతరం తనిఖీ పెంచాలని సూచించారు. ఆర్ధిక నేరాల విషయంలోనూ పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. డ్రోన్ల వినియోగం కూడా బాగా పెరగాలని, ఆర్టీజీఎస్ విభాగంతో అనుసంధానం కావాలని సూచించారు. 15 నిమషాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం సేవలు అందాలని వ్యాఖ్యానించారు.
ఎడాపెడా ట్రాఫిక్ చలాన్లు వద్దు
పోలీసుశాఖపై సమీక్షలో ట్రాఫిక్ చలాన్లపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వాహనదారులపై ఎడాపెడా ట్రాఫిక్ చలాన్లు విధించడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో కూడా ట్రాఫిక్ చలాన్ల విధించడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రహదారి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. రోడ్లపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
