జగన్ మీద సన్న సన్నగానే !
ఏపీలో పాతిక మంది మంత్రులు ఉన్నారు. ఇక చంద్రబాబు లోకేష్ ఎటూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తారు. పవన్ సమయం సందర్భం బట్టి గట్టిగానే మాట్లాడుతారు
By: Tupaki Desk | 15 Jun 2025 4:13 AMఏపీలో పాతిక మంది మంత్రులు ఉన్నారు. ఇక చంద్రబాబు లోకేష్ ఎటూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తారు. పవన్ సమయం సందర్భం బట్టి గట్టిగానే మాట్లాడుతారు. కానీ అధిక శాతం మంత్రులు మాత్రం పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని అంటున్నారు.
ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వాన్ని నడిపే కీలక నాయకుల మీద కానీ విమర్శలు వచ్చినప్పటికీ గట్టిగా రియాక్టు కావడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. నారా లోకేష్ విద్యా శాఖా మంత్రిగా ఉంటూ తల్లికి వందనం అన్న పధకాన్ని ఎట్టకేలకు పట్టాలెక్కించారు. ఈ పధకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికీ నగదు లభిస్తోంది.
ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలని అంటున్నారు. ఇప్పటిదాకా ఏ పధకం కూడా ఒకే ఇంట్లో ఇద్దరికి ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లికి వందనం అందరి పిల్లలకు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే మొదట పదిహేను వేలు చెప్పి దానిని 13 వేలకు తగ్గించారని ఆ రెండు వేలు లోకేష్ జేబులోకి వెళ్ళాయని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. దాని మీద నారా లోకేష్ సీరియస్ అయ్యారు ఆయన న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ నేతల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సరే ఆయన తన వరకూ స్పందన తెలియ చేసారు కానీ కూటమిలోని మంత్రులు ఏమి చేస్తున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది అని అంటున్నారు.
తల్లికి వందనం అన్నది సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా ఉంది. ఇది ప్రతిష్టగా చేసుకుని ప్రభుత్వం చేపట్టింది. ఈ పధకం గురించి ప్రచారం కూడా చేయాల్సి ఉంది. అలాంటివి వైసీపీ ఈ తరహా విమర్శలు చేసినపుడు గట్టిగా ప్రభుత్వం నుంచి గొంతు పెంచాల్సి ఉంది. అయితే మంత్రులలో కొద్ది మంది తప్ప మిగిలిన వారు అంతా పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
మరి ఈ విధంగా ఉంటే ఎలా అన్న చర్చ వస్తోంది. ప్రభుత్వానికి నిజానికి చూస్తే ఖజానా సహకరించడం లేదు అయినప్పటికీ తల్లికి వందనం వంటి అతి పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల విద్యార్థులకు మేలు జరిగితే భవిష్యత్తులో విద్యా ప్రమాణాలు కూడా పెరుగుతాయని అంటున్నారు.
అయితే ఇంత జరిగినా కూడా పాజిటివిటీని ప్రచారం చేసుకోవడంలో కూడా మంత్రులు వెనకబడి ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కొందరు మంత్రులు తప్ప మిగిలిన వారు ఎందుకు రియాక్టు కావడం లేదు అన్న చర్చ సాగుతోంది. ఇక చూస్తే కనుక ఇందులో నుంచి రెండు వేల రూపాయలను పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అని గుర్తు చేస్తున్నారు. అయినా సరే విమర్శల బురద వచ్చినపుడు ధీటుగా జవాబు ఇవ్వకపోతే ప్రజలకు మెసేజ్ వేరేగా వెళ్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో మంత్రులు స్పీడ్ పెంచాల్సి ఉందని అంటున్నారు.