Begin typing your search above and press return to search.

ఇక నుంచి ‘ఏపీ వెల్త్ ఫండ్’’ - బడ్జెట్ లో కీలక ప్రతిపాదన

ఏపీ బడ్జెట్ ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రతిపాదన చేశారు.

By:  Tupaki Political Desk   |   14 Feb 2026 4:00 PM IST
ఇక నుంచి ‘ఏపీ వెల్త్ ఫండ్’’ - బడ్జెట్ లో కీలక ప్రతిపాదన
X

ఏపీ బడ్జెట్ ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రతిపాదన చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాల కోసం కొత్తగా 'ఏపీ వెల్త్ ఫండ్ ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఆర్థిక మంత్రి కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ వెల్త్ ఫండ్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించడం లేదు. దీంతో వెల్త్ ఫండ్ అంటే ఏంటి? దానితో ఏం చేస్తారు? ప్రజలకు ఏం ఉపయోగం అన్న చర్చ జరుగుతోంది.

సాధారణంగా దేశాలు తమ వద్ద ఉన్న మిగులు నిధులను భవిష్యత్తు అవసరాల కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా ఒక నిధిగా ఏర్పాటు చేస్తాయి. దీనిని సావరిన్ వెల్త్ ఫండ్ అంటారు. అదే తరహాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సొంత వనరులను సమకూర్చుకోవడానికి, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడానికి 'ఏపీ వెల్త్ ఫండ్'ను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి చిన్న అవసరానికి అప్పులపై లేదా కేంద్రంపై ఆధారపడకుండా, రాష్ట్రమే ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు.

ప్రస్తుతం నార్వే, అబుదాబి వంటి దేశాలు తమ భవిష్యత్తు తరాల కోసం 'వెల్త్ ఫండ్స్'ను నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేశవ్ వెల్లడించారు. మంత్రి చెప్పిన ప్రకారం ఇకపై రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఏపీ వెల్త్ ఫండ్‌లో చేర్చనున్నార. ఈ డబ్బును లాభదాయకమైన రంగాల్లో పెట్టుబడిగా పెట్టనున్నారు. తద్వారా వచ్చే లాభాలను రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తారని అంటున్నారు. ఈ ఫండ్ ద్వారా వచ్చే నిధులను కేవలం ఖర్చుల కోసం కాకుండా, రాష్ట్రాన్ని ఒక 'గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్'గా మార్చేందుకు, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని చెబుతున్నారు.

2047 నాటికి 'స్వర్ణాంధ్ర' లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ వెల్త్ ఫండ్ ఒక బలమైన పునాదిగా మారుతుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, రాష్ట్రం తన సొంత కాళ్లపై నిలబడటానికి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును పొదుపు చేస్తూనే అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ఈ 'ఏపీ వెల్త్ ఫండ్' ఒక కీలకమైన ఆర్థిక సాధనంగా వ్యాఖ్యానిస్తున్నారు.

భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడిన ఆర్థిక మంత్రి కేశవ్ సీఎం మార్గనిర్దేశంలో ‘ఏపీ వెల్త్ ఫండ్’ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. డీప్ టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు చేయడం వంటి విధానాల ద్వారా రాష్ట్రాన్ని కొత్త శకంలోకి నడిపిస్తున్నామని ఇందుకు ఏపీ వెల్త్ ఫండ్ ఉపయోగపడుతుందని కేశవ్ అభిప్రాయపడ్డారు.